చైనా ‘స్పై బెలూన్‍’ను కూల్చివేసిన అమెరికా

చైనా నిఘా బెలూన్ ను అమెరికా కూల్చివేసింది. డ్రాగన్ దేశం పంపిన స్పై బెలూన్‍గా కొన్ని రోజుల నుంచి అనుమానిస్తున్న అమెరికా ఆకాశంలో తిరుగుతున్న దాన్ని ఆదివారం కుప్పకూల్చింది. కరోలినా తీరంలో శిథిలాలు సముద్రంలో పడే విధంగా అమెరికా దళాలు ఈ బెలూన్‍ను పేల్చివేశాయి.
ఈ విషయాన్ని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. ఆ బెలూన్‍ ‘సంగతి చూసుకుంటాం” అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పిన గంటల వ్యవధిలోనే ఈ చర్య జరిగింది.

“నేడు ఉద్దేశపూర్వకంగా, చట్టబద్ధంగా చర్య చేపట్టాం. అధ్యక్షుడు జో బైడెన్, ఆయన జాతీయ రక్షణ బృందం ఎల్లప్పుడూ అమెరికా ప్రజల భద్రతకే తొలి ప్రాధాన్యతనిస్తుందని నిరూపించాం. పీఆర్సీ (రిపబ్లిక్ ఆఫ్ చైనా) నిబంధనల ఉల్లంఘనను ప్రభావంతంగా తిప్పికొట్టాం” అని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఆకాశంలో చిన్న పేలుడు జరిగినట్టు అమెరికా స్థానిక మీడియాలో ఫుటేజ్ వెల్లడైంది. ఆ తర్వాత ఆ బెలూన్ సముద్ర జలాల్లో పడిపోతున్నట్టుగా కనిపించింది. ఇక ఆ బెలూన్ శిథిలాలను వీలైనంత మేర సేకరించేందుకు ఓ షిప్‍ను కూడా అమెరికా పంపింది.

 ఉత్తర అమెరికాలోని ప్రధానమైన సైనిక స్థావరాల సమాచారాన్ని తెసుకునేందుకు ఈ స్పై బెలూన్‍ను చైనా పంపిందని అమెరికా అనుమానించింది. దీంతో అమెరికా, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ బెలూన్ గురించి జో బైడెన్‍ను మీడియా ప్రశ్నించగా.. “దాని గురించి మేం చూసుకుంటాం” అని పేర్కొన్నారు.

అమెరికా గగనతలంలో జనవరి 28న తొలిసారి ఈ బెలూన్‍ను గుర్తించారు. ఖండాంతర బల్లాస్టిస్ మిసైళ్లు ఉన్న మోంటానాలో ముందుగా ఈ బెలూన్‍ను కనిపెట్టింది అమెరికా. ఆ తర్వాత క్రమంగా అది ఉత్తర కరోలినాకు చేరుకుంది. అక్కడ ఆ బెలూన్‍ను అమెరికా కూల్చివేసింది. ఆ బెలూన్ తమ దేశానికే చెందిందని చైనా కూడా అంగీకరించింది. అయితే వాతావరణంపైపరిశోధన చేసేందుకు దాన్ని పంపామని, అది సివిలియన్ ఎయిర్ షిప్ అని ప్రకటించింది. అనుకోకుండా అది దారి మార్చుకొని అమెరికా వైపునకు వెళ్లిందని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

చైనా హెచ్చరిక

కాగా, అమెరికా తమ బెలూన్‌ను కూల్చివేయడంపై డ్రాగన్‌ ఘాటుగా స్పందించింది. పౌర గగన నౌక కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనికి అగ్రరాజ్యం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది తీవ్ర ఉల్లంఘనేనని ఆరోపించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బెలూన్‌ సంచరించిన ఘటనను అమెరికా ప్రశాంతంగా డీల్‌ చేయాలని కోరుకున్నట్లు తెలిపింది.