పాక్ మాజీ హోంమంత్రి షేక్ రషీద్‌ అరెస్ట్

పాకిస్తాన్ హోంశాఖ మాజీ మంత్రి షేక్ రషీద్‌ను బుధవారం రాత్రి 12:30 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇమ్రాన్ ఖాన్ హత్యకు పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుట్ర పన్నారనే ఆరోపణలతో అతడి అరెస్ట్ ముడిపడి ఉన్నది. రషీద్‌పై ఇప్పటికే ఇస్లామాబాద్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.
 
కాగా, ఆసిఫ్‌ అలీ జర్దారీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ తండ్రి.  పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా తనను అరెస్ట్ చేరని షేక్‌ రషీద్‌ మీడియాకు చెప్పారు. దాదాపు 200 మంది పోలీసులు తన ఇంటి కిటికీలు, తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించి బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారని ఆయన తెలిపారు.
 
 తన అరెస్టు వెనుక షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ హస్తం ఉన్నదని ఆయన ఆరోపించారు. ఈ నెల 27 న ఇమ్రాన్‌ఖాన్‌ను చంపడానికి మాజీ అధ్యక్షుడు జర్దారీ కుట్ర పన్నారని షేక్ రషీద్ ఈ నెల 27 న ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నేందుకు ఉగ్రవాద సంస్థకు జర్దారీ డబ్బు ఇస్తున్నాడని రషీద్ తెలిపాడు.కాగా, జనవరి 30 న పోలీసులు రషీద్‌కు సమన్లు పంపారు. దాంతో మాజీ అధ్యక్షుడిపై చేసిన ఆరోపణల నుంచి రషీద్ వెనక్కి తగ్గారు. ఇమ్రాన్ ఖాన్ ప్రకటన తెరపైకి రావడంతోనే తానా విషయం చెప్పినట్లు రషీద్ తెలిపాడని పోలీసులు చెప్పారు.

 ‘నా ప్రకటనకు కట్టుబడి ఉన్నాను. ఇమ్రాన్ ఖాన్ చెప్పింది నిజమే. అసిఫ్ జర్దారీ అతడిని చంపాలనుకుంటున్నాడు. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రాణాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నది. ఇమ్రాన్ ఖాన్‌ను అనర్హుడిగా ప్రకటించి బలహీనపరచడం జర్దారీ ప్రణాళిక. ఈ కేసులో వాంగ్మూలం సమర్పించేందుకు నా లాయర్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. పోలీసులు తీసుకోలేదు’ అని షేక్‌ రషీద్‌ ఫిబ్రవరి 1న ట్వీట్‌ ద్వారా తెలిపారు.