కెనడాలో పెరుగుతున్న హిందూ ఫోబియా పట్ల ఆందోళన

కెనడాలో హిందూ ఫోబియా పెరుగుతుండటంపై భారతీయ మూలాలుగల కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ఆ దేశ పార్లమెంటులో బుధవారం ప్రస్తావించారు.
 
బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ మందిరంపై విద్వేష శక్తులు దాడులు చేసి, భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలను రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్లమెంటులో తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సంబంధించిన వీడియోను ట్వీట్‌ చేశారు.  కెనడాలో హిందూ ఫోబియా పెరుగుతుండటంతో హిందూ కెనడియన్లు తీవ్ర భయాందోళనలతో బాధపడుతున్నారని తెలిపారు.
 
ఇది భయానక ధోరణి అని తెలిపారు. హిందువులపై పెరుగుతున్న విద్వేషపూరిత నేరాలను ఆపాలని కోరారు. హిందూ ఫోబియా హిందువులపై భౌతిక దాడులకు తెగబడే స్థాయికి చేరిందని తెలిపారు. చంద్ర ఆర్య మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, హిందూ వ్యతిరేకులు, భారత వ్యతిరేకులు కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతుండటం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఈ పరంపరలో తాజాగా బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ మందిర్‌పై దాడి జరిగిందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషం చిమ్మడం దగ్గర నుంచి ఇప్పుడు భౌతిక దాడులు జరిగే స్థాయికి పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇక తదుపరి ఏం జరగబోతోందని ప్రశ్నించారు. కెనడా ప్రభుత్వంలోని అన్ని స్థాయుల్లోని అధికారులు, నేతలు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని కోరారు.
 
ఇదిలావుండగా, బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ మందిరంపై దాడిని ఇండియన్ కాన్సులేట్ కూడా తీవ్రంగా ఖండించింది. కెనడాలోని హిందువుల మనోభావాలను ఈ దాడులు తీవ్రంగా గాయపరుస్తున్నాయని తెలిపింది. బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్ మందిరం భారతీయ వారసత్వ సంపద చిహ్నమని తెలిపింది. ఈ దేవాలయంపై భారత వ్యతిరేక నినాదాలు రాయడాన్ని ఖండించింది. కెనడా అధికారుల వద్ద ఈ విషయాన్ని లేవనెత్తినట్లు పేర్కొంది