సెమీకండెక్టర్లలో చైనాను ఎదుర్కొనేందుకు భారత్ – అమెరికా దోస్తీ

ప్రపంచ దేశాలకు సెమీకండెక్టర్ల కొరతతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ సెమీకండెక్టర్లు ఒక్క చైనాలోనే ఉత్పత్తయ్యావి. తమతో కయ్యం పెట్టుకున్న దేశాలకు సెమీకండెక్టర్లను ఎగుమతి చేయకుండా చైనా అడ్డుకుంటూ వస్తున్నది. దీంతో ఎన్నో రకాల పరికరాల తయారీ నిలిచిపోవడమే కాకుండా ఖరీదైనవి కూడా మారాయి.

ఈ సమస్యను అధిగమించేందుకు భారత్‌-అమెరికా దేశాలు చేతులు కలిపాయి. ఇరుదేశాల మధ్య అంతరిక్షం టెక్నాలజీ గురించి కూడా చర్చ జరిగింది. ఈ చర్చల్లో ఇస్రో చీఫ్‌ ఎస్‌ సోమనాథ్‌ కూడా హాజరయ్యారు. చైనా టెక్నాలజీ సమస్యను ఎదుర్కోవడానికి ఐసెట్‌ ఒప్పందంపై భారత్‌-అమెరికా దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సుల్లివన్‌ల సమక్షంలో ఒప్పంద పత్రాలను ఇరుదేశాల ప్రతినిధులు మార్చుకున్నారు. భారత్‌-అమెరికా దేశాల మధ్య ఈ ఒప్పందం జరుగడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా సెమీకండక్టర్లు, సైనిక పరికరాలు, కృత్రిమ మేధస్సుతో ఇరు దేశాలు చైనా టెక్నాలజీతో పోటీ పడగలవని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విశ్వాసం ప్రకటించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేస్తుందని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

ఈ ఒప్పందం సందర్భంగా రెండు దేశాల భద్రతా సలహాదారుల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల్లో సాంకేతికత బదిలీ విషయంలో అనేక అడ్డంకులు తొలగిపోయాయని సూచించింది. ఇది రెండు దేశాల మధ్య పరస్పర సమన్వయాన్ని బలోపేతం చేస్తుందని వెల్లడించింది.  2022 మే నెలలో జపాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల మధ్య చర్చల తర్వాత ఈ ఒప్పందం తెరపైకి వచ్చింది. దీని ద్వారా ప్రపంచంలోని 10 సున్నితమైన గేమ్‌ఛేంజర్ టెక్నాలజీల తలుపులు భారతదేశానికి తెరిచినట్లుగా భావిస్తున్నారు.