బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శించడం కోసమే విమర్శలు

సమాజంలోని అన్ని వర్గాలను మెప్పించిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శించడం కోసమే విమర్శలు చేస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బడ్జెట్‌కు వివిధ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రతిపక్షాలు విమర్శించేందుకు సైతం తావులేకుండా ఉందని స్పష్టం చేశారు.

తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని విమర్శించే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేం ప్రతిపాదనలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక బడ్జెట్ అన్న ఆరోపణలను ఖండిస్తూ ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నది ఎవరని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా ఎరువుల ముడి సరకు ధరలు పెరిగినా సరే ఆ భారం రైతులపై పడకుండా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించారు.

రాష్ట్రానికి విద్యా సంస్థల కేటాయింపు జరగలేదన్న విమర్శకు బదులిస్ రాష్ట్రంలో ఉన్న త్రిపుల్ ఐటీని సరిగా నిర్వహింటచడం చేతకావడంలేదని సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో తిండి లేదని, తరచుగా ఫుడ్ పాయిజన్ అవుతోందని గుర్తు చేశారు. విద్యాసంస్థల్లో చాక్ పీసులకు గతి లేక విద్యార్థులు రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, ఉపాధ్యాయులు లేరని ఆరోపించారు. ఇక పేదలకు ఇళ్లు ఇవ్వడం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు మంజూరు చేసిన ఇళ్లను కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బిఆర్ఎస్ సభను బహిష్కరించండి

రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసి ఆదివాసీ ఆడబిడ్డను అవమానించిన బీఆర్ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసే సభకు ఎవరూ వెళ్లొద్దని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి ఆదివాసీ ఆడబిడ్డ రాష్ట్రపతి అవుతుంటే బీఆర్ఎస్ ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గిరిజన-ఆదివాసీలందరూ మహారాష్ట్రలో బీఆర్ఎస్ తలపెట్టిన సభను బహిష్కరించాలని స్పష్టం చేశారు.