తెలంగాణకు కల్వకుంట్ల కుటుంబమే శాపం

కేసీఆర్ కుటుంబం ఉన్నన్ని రోజులు రాష్ట్రానికి నష్టమే తప్ప ఏమాత్రం మేలు జరగదని, తెలంగాణకు కల్వకుంట్ల కుటుంబమే పెద్ద శాపమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.  బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న విషయాలను చూడలేని స్థితిలో కల్వకుంట్ల కుటుంబం ఉందని ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను భారతదేశ బడ్జెట్‌గానే చూడాలే గానీ కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కాదని హితవు చెప్పారు. 

రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ ఖర్చులో సగం కేంద్రం ఇస్తామని చెప్పినా, మిగతా సగం కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని ఆయన  ఆరోపించారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణంలో భూసేకరణ ఖర్చు రాష్ట్రాలు భరిస్తాయని, ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు కేంద్రం భరిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో భూసేకరణ ఖర్చులో కూడా సగం భరిస్తామని కేంద్రం ముందుకొచ్చినా రాష్ట్ర సర్కార్ నుంచి స్పందన లేదని విమర్శించారు.

ఎంఎంటీఎస్ ఫేజ్-2కు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదని, 3 వేల మందికి ఉపాధి కల్పించే రైల్వే ఓవర్హాలింగ్ యూనిట్ మంజూరు చేయిస్తే, అప్రోచ్ రోడ్ ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. రూ. 6 కోట్ల ఖర్చుతో కట్టిన యూరియా ప్లాంట్ ప్రారంభోత్సవానికి కూడా ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదని వెల్లడించారు. సైన్స్ సిటీ మంజూరు చేసుకుని ల్యాండ్ కోసం లెటర్ల మీద లెటర్లు రాసినా స్పందన లేదని, కనీసం లెటర్ అందినట్టు జవాబు కూడా లేదని ఆయన విమర్శించారు.

ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలను డిజిటలైజ్ చేసే ‘భారత్ శ్రీ’ పథకంలో భాగంగా హైదరాబాద్ లో ఎపిగ్రఫీ మ్యూజియంను ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన సిద్ధమైందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.