కేంద్ర బడ్జెట్‌ను జనంలోకి తీసుకెళ్లడంపై బీజేపీ దృష్టి

తాము ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను జనంలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ దృష్టి సారిస్తుంది.  తెలంగాణలోనూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు బడ్జెట్ పై ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. తెలంగాణలో 3 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర నేతలను హైకమాండ్ ఆదేశించింది.

ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కేంద్ర మంత్రులు, పార్టీలోని జాతీయ పదాధికారులు తెలంగాణకు వచ్చే అవకాశముంది. రాష్ట్ర పదాధికారులు, ప్రజాప్రతినిధులు, సబ్జెక్ట్ నిపుణులు ఇంటరాక్షన్ సెషన్లు నిర్వహించి అర్థమయ్యేలా వివరించనున్నారు. ఇందుకు సంబంధించి నలుగురితో ప్రత్యేక కమిటీని పార్టీ ఏర్పాటు చేసింది.

సెంట్రల్ కమిటీలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఉన్నారు. మాజీ ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమిటీలో డా. ప్రకాశ్ రెడ్డి, పాల్వాయి రజని, సంగప్ప ఉన్నారు. జిల్లా స్థాయిలో ముగ్గురితో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఇంటికీ కరపత్రాలు సైతం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏ ఒక్క రంగాన్ని విడిచిపెట్టకూడదని డిసైడ్ అయ్యారు. యువత, వ్యాపారవేత్తలు, మహిళలు, రైతులు రంగాల వారీగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు.

నిర్దిష్ట అంశాలను ఎంపిక చేసేందుకు ప్రతి రాష్ట్రంలో ఆర్థిక నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. సోషల్ మీడియా ద్వారా సైతం అంశాల వారీగా కంటెంట్ తో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని, బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా బిజెపి ప్రణాళిక ఏర్పాటు చేసుకుంది.

ప్రజాకర్షక అంశాలను విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు రూపొందించింది. విద్యార్థులకు బడ్జెట్ గురించి తెలుసుకోవడంపై క్విజ్ పోటీలను నిర్వహించాలని దిశానిర్దేశం చేసింది.  రాష్ట్రాల వారీగా స్థానిక భాషల్లో బుక్ లెట్లను ప్రచురించి ప్రతీ ఇంటికీ పంపిణీచేసేలా కార్యక్రమం రూపొందించుకోవాలని స్పష్టం చేసింది.  ప్రతి జిల్లా కేంద్రంలో వివిధ వృత్తుల వారితో సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నేతలకు సూచించింది. మార్కెట్ కేంద్రాలు, ట్రేడ్ సెంటర్లు, డాక్టర్లు, ప్రభుత్వ పెన్షనర్లు, చార్టెడ్ అకౌంచెట్లు, బ్యాంకు ఉద్యోగులు, లాయర్లు, వ్యాపార సంఘాలు, రైతు నాయకులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.