బిబిసి డాక్యుమెంటరీ వివాదంలో ప్రధాని మోదీకి రష్యా మద్దతు

బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ ప్రధాని నరేంద్ర మోదీపై  చిత్రీకరించిన డాక్యుమెంట్ తో తలెత్తిన వివాదంలో  రష్యా భారత్ కు` అండగా నిలిచింది. బీబీసీపై ఘాటు విమర్శలు సంధించింది. భారత్ పై పరోక్షంగా సమాచార యుద్ధానికి పాల్పడినట్లు ఆరోపించింది. బీబీసీ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించడాన్ని రష్యా సమర్థించింది.
 
`ఇండియా- ది మోదీ క్వశ్చన్’ అనే టైటిల్ తో రూపుదిద్దుకున్న ఈ డాక్యుమెంటరీని దేశంలో ఎక్కడ కూడా  ప్రదర్శించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి విరుద్ధంగా ఈ డాక్యుమెంటరీ ఉండటం వల్ల దీన్ని నిషేధించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
 
దీని తరువాత కూడా కేరళతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వంటి కొన్ని చోట్ల దీన్ని ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇవ్వాళ పలు పిటీషన్లు దాఖలయ్యాయి నిషేధం ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమంటూ పిటీషనర్లు పేర్కొన్నారు. పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ జరుపుతామని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.
 
ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కింద అత్యవసరంగా లిస్టింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ అడ్వొకేట్ ఎంఎల్‌ శర్మ ఈ పిటీషన్ వేశారు. ఆయనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్‌ ఎన్‌ రామ్‌, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రా కూడా మరో పిటీషన్ వేశారు.

 
ఈ పరిణామాల మధ్య రష్యా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ కు వ్యతిరేకంగా బీబీసీ వివిధ రంగాలలో సమాచార యుద్ధం చేస్తోందని ఆరోపించింది.  భారత్ లో వివిధ రంగాల్లో బీబీసీ సమాచార యుద్ధానికి పాల్పడుతోందనడానికి బీబీసీ డాక్యుమెంటరీ ఓ సాక్ష్యమని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా స్పష్టం చేశారు. భారత్, ఆ దేశంతో మిత్రత్వాన్ని కొనసాగిస్తోన్న రష్యాపై మాత్రమే కాకుండా, ఇతర ప్రపంచ దేశాల విధానాలనూ బీబీసీ ప్రశ్నించినట్టయిందని చెప్పారు.
 
కోర్టు సమయాన్ని వృథా చేయడమే
ఇలా ఉండగా, బీబీసీ డాక్యుమెంటరీపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేయడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మండిపడ్డారు. దేశంలో వేలమంది సామాన్య ప్రజలు కేసుల సత్వర విచారణ కోసం, తీర్పుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇలాంటి పిటిషన్లు వేయడం ఎంతో విలువైన సుప్రీంకోర్టు సమయాన్ని వృథా చేయడమేనని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
భారతకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించిందని కేంద్ర సమాచార, ప్రసార, విదేశీ వ్యవహారాల శాఖలు ఆరోపించాయి. భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేలా బీబీసీ దుష్ప్రచారం చేస్తున్నదని పేర్కొన్నాయి.