అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ టీమిండియా కైవసం

యువ ఆటగాళ్లలో ప్రతిభ వెలికితీసేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ జట్టు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మెగాటోర్నీలో ఎదురులేని ఆటతీరు కనబర్చిన మన అమ్మాయిలు ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ను అందుకున్నారు.

ఆదివారం జరిగిన తుదిపోరులో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయంతో ఫైనల్‌ చేరిన షఫాలీ బృందం తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించింది. పుట్టిన రోజు కానుకగా ప్రపంచకప్‌ కావాలన్న కెప్టెన్‌ షఫాలీ వర్మ కల నెరవేరింది.

మహిళల క్రికెట్‌లో ఏ విభాగంలోనైనా భారత జట్టుకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం. సీనియర్ మహిళల టీమ్ మూడు సార్లు వన్డే, టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరినా  టైటిల్ అందుకోలేకపోయింది. కానీ షెఫాలీ సేన సరికొత్త చరిత్రను సృష్టించింది. ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకు కుప్పకూలింది.

భారత బౌలర్లు టిటాస్ సధు, అర్చనా దేవి, పర్షావి చోప్రా రెండేసి వికెట్లు తీయగా మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ తలో వికెట్ తీసారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ర్యానా మాక్‌డోనాల్డ్(19) టాప్ స్కోరర్‌గా నిలవగా ముగ్గురు బ్యాటర్లు డకౌటవ్వడం విశేషం.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత అమ్మాయిలు 14 ఓవర్లలోనే 3 వికెట్లకు కోల్పోయి 69 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు షెఫాలీ వర్మ(15), శ్వేతా సెహ్రావత్(5) విఫలమైనా.. సౌమ్య తివారీ(24), తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిషా(24) రాణించి సంచలన విజయాన్నందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో హన్నా బేకర్, గ్రేస్ స్క్రీవెన్స్ తలో వికెట్ తీసారు.

ఈ టోర్నీలో ఫైనల్‌తో కలిపి మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన షెషాలీ సేన.. ఆస్ట్రేలియాతో మినహా ప్రతీ మ్యాచ్ గెలిచింది. సూపర్-6లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లీగ్ దశలో సౌతాఫ్రికా, యూఏఈ , స్కాట్లాండ్ టీమ్స్‌ను ఓడించిన భారత్.. సూపర్-6లో శ్రీలంకను ఓడించి సెమీఫైనల్ చేరింది.

సెమీఫైనల్లో భారత్‌కు కొరకరాని కొయ్యగా ఉన్నన్యూజిలాండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. చారిత్రాత్మక విజయాన్నందుకున్న షెఫాలీ సేనకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.

ఐసీసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ టోర్నీ ద్వారా భారత జట్టుకు మెరికల్లాంటి యువ ఆటగాళ్లు పరిచయమయ్యారు. సీనియర్‌ స్థాయిలో ఎన్నో కీలక మ్యాచ్‌లు ఆడిన 19 ఏండ్ల షఫాలీ వర్మ తాజా టోర్నీలో బౌలర్లకు సంహస్వప్నంలా నిలిస్తే.. శ్వేతా షెరావత్‌ తనలోని దూకుడైన బ్యాటర్‌ను ప్రపంచానికి చాటింది. సౌమ్యతివారి కూడా కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది.