మార్కెట్ లోకి వచ్చిన `భారత్ యూరియా’

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత భారత్‌ యూరియా మార్కెట్లోకి వచ్చింది. ఇకపై అన్ని రకాల ఎరువులు భారత్‌ యూరియా పేరుతోనే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ జన ఊర్వరక్‌ ప్రయోజన పథకం (పీఎంబీజేపీ) పేరుతో పాటు భారత్‌ యూరియా అని పెద్ద అక్షరాల్లో బస్తాలపై ముద్రించి ఉంటుంది. ఆ బస్తాలను విక్రయించే వివిధ కంపెనీల పేర్లు మాత్రం చిన్న అక్షరాల్లో ముద్రించి ఉంటాయి.
 
ఎరువుల దుకాణాల బోర్డులను కూడా భారతీయ జన్‌ ఊర్వరక్‌ పరియోజన – ప్రధాన మంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రం – భారత్‌ యూరియా పేరుతో ప్రదర్శించాల్సి ఉంటుంది. వ్యవసాయం కోసం రైతులు కొనుగోలు చేసే వివిధ రకాల రసాయనిక ఎరువులపై కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల రాయితీలు అందిస్తోంది. ఆ రాయితీలన్నిటినీ అందుకుంటున్న కంపెనీలు బస్తాలపై తమ పేర్లు ముద్రించుకోవటమే కాకుండా డిమాండ్‌కు అనుగుణంగా తమ ఇష్టానుసారం ధరలను ప్రకటించి రైతులకు విక్రయిస్తున్నాయి.
 
దీని వల్ల ప్రభుత్వం అందించే రాయితీలను రైతులు ప్రత్యక్షంగా అందుకోలేకపోతున్నారు. నాణ్యాతా లోపాలను కనిపెట్టటం కూడా కష్టతరమవుతోంది. ఏ ఎరువును ఏ పంటకు ఏ దశలో ఎంత మోతాదులో వినియోగించాలో కూడా అవగాహనకు రాలేకపోతున్నారు. ఒకే నిష్పత్తి కలిగిన ఒక్కొక్క మిశ్రమ ఎరువుకు కంపెనీల వారీగా వివిధ పేర్లు ఉండటంతో మార్కెట్లో రైతులు అయోమయానికీ, మోసానికి గురికావాల్సి వస్తోంది.
 
కంపెనీలన్నీ ఒకే ప్రమాణంతో నాణ్యత కలిగిన ఎరువులను ఉత్పత్తి చేయటం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకే నిష్పత్తి ఉన్న ఎరువులు పనిచేసే విధానంలోనూ కంపెనీల వారీగా తేడాలుంటున్నాయి. ఈ నేపథ్యంలో “ఒకే జాతి– ఒకే యూరియా” నినాదంతో భారతీయ జన్‌ ఊర్వరక్‌ పరియోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్‌ యూరియా బ్రాండ్‌ ను ప్రకటించింది.
 
భారత్‌ యూరియా బ్రాండ్ల పేరుతో ఎరువుల విక్రయాలకు గత ఏడాది గాంధీ జయంతి సందర్భంగా 2022 అక్టోబరు 2నే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. అప్పటికే వివిధ కంపెనీల పేరుతో ముద్రించి మార్కెట్లో ఉన్న ఎరువులను విక్రయించేందుకు సడలింపు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గత ఏడాది నవంబరు 15 లోపే పాత సంచులకు స్వస్తి పలకాల్సి ఉన్నా కంపెనీల వద్ద పాత నిల్వలు అధికంగా ఉండటంతో ఏదో రూపంలో వాటిని విక్రయిస్తూ వచ్చారు.
 
ఇపుడు పాత ఎరువుల బస్తాల వినియోగం తగ్గుతున్న కొద్దీ భారత్‌ బ్రాండ్‌ ఎరువులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దీంతో ఎరువుల దుకాణాల్లో భారత్‌ బ్రాండ్‌ బస్తాలు దర్శమిస్తున్నాయి. భారత్‌ బ్రాండ్‌ బస్తాలపై ఎరువుల రకాన్ని బట్టి భారత్‌ డి-అమోనియం ఫాస్సెట్‌ (డీఏపీ), భారత్‌ మ్యూరేట్‌ ఆఫ్‌ ఫొటాష్‌(ఎంఓపీ), భారత్‌ నైట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాషియం (ఎన్‌.పి.కె)..ఇలా పూర్తి వివరాలు ముద్రించి ఉంటాయి.
కిసాన్‌ సమృద్ధి కేంద్రాలు
ఎరువులను విక్రయించే అన్ని దుకాణాలను ఇకపై ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రాలు(పీఎంకేఎస్కే) గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సుమారు 3.3 లక్షల ఎరువుల దుకాణాలున్నట్టు అంచనా. గత ఏడాది చివరినాటికి సుమారు 30 వేల దుకాణాలను ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా మార్పు చేయగా, ఈనెలలో 1.8 లక్షలు, ఫిబ్రవరి మరో 1.7 లక్షల దుకాణాల పేర్లను మార్పు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
కిసాన్‌ సమృద్ధి కేంద్రాల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు కేంద్రం ప్రకటించింది. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను నిర్దేశించిన ధరలకే లభించేలా చూడటంతో పాటు- కల్తీలను సంపూర్ణంగా అరికట్టేందుకు సమృద్ధి కేంద్రాలు తోడ్పడనున్నాయి.
కిసాన్‌ సమృద్ధి కేంద్రాల్లో విత్తన, ఎరువు నాణ్యతతో పాటు భూసార పరీక్షలు కూడా నిర్వహించేలా ల్యాబులను ఏర్పాటు చేయనున్నారు. టీవీ, ఇంటర్‌ నెట్‌ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు. ఎరువులు కొనుగోలు చేసేందుకు వచ్చే రైతులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికపుడు వ్యవసాయ సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.