గవర్నర్ పై దిగొచ్చిన కేసీఆర్ … అసెంబ్లీలో ప్రసంగంకు సై

గత ఏడాది కాలంగా గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ తో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చివరకు దిగివచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవుతాయని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.  ఫిబ్రవరి 3న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఇప్పటివరకు ఆమోదం తెలపకపోవడం తో రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసిన ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది.
 
గవర్నర్‌ను విమర్శించవద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్ కూడా  తన రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.
 
తొలుత లంచ్ మోషన్ కు అనుమతించాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరినప్పుడు ‘లంచ్ మోషన్’ మెన్షన్ చేసిన సందర్భంలో న్యాయస్థానం కీలక వాఖ్య చేసింది. ఈ విషయంలో గవర్నర్‌కు కోర్టు నోటీసు ఇవ్వగలదా ? అని అడ్వకేట్‌ జనరల్‌ ఏజీని ప్రశ్నించింది. గవర్నర్‌ విధుల్లో కోర్టులు న్యాయసమీక్ష చేయొచ్చా ? కోర్టులు మితిమీరి జోక్యం చేసుకుంటున్నాయని మీరే అంటారు కదా? అని ఏజీని ఉద్దేశించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ పిటిషన్‌పై జరిగే విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తారని ఏజీ తెలిపారు. లంచ్ మోషన్‌కు అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడ్వకేట్ జనరల్ సమాధానంతో మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరిపేందుకు సీజే ధర్మాసనం అంగీకరించింది.
ఈ లోగా, దుశ్యతం దవే, రాజ్ భవన్ తరపున అశోక్ ఆనంద్ చర్చించుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని న్యాయవాదులు ఓ అవగాహనకు వచ్చారు. బడ్జెట్‌లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని.., గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని కోర్టుకు తెలిపారు.  కొంత కాలంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరగడంతో గవర్నర్‌ చర్యలపై ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ నుంచి అనుమతి రాకపోవడమే సర్కారు నిర్ణయానికి కారణమైంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉన్నందున.. అనుమతి కోరుతూ ఈ నెల 21నే గవర్నర్‌కు లేఖ పంపింది.

అయితే గవర్నర్‌ తమిళిసై మాత్రం ఇప్పటికీ అనుమతి తెలపలేదు. పైగా గవర్నర్‌ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్‌ కమ్యూనికేషన్‌ వెళ్లింది. బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేముందు గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని, అందుకు సంబంధించిన కాపీ తమకు పంపారా? లేదా? అని గవర్నర్‌ కార్యాలయం సర్కారును కోరింది.

దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. దాంతో గవర్నర్‌ కూడా అనుమతి విషయంలో నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఫిబ్రవరి 3 సమీపిస్తుండటంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. అయితే, కేసీఆర్ సర్కారు చివరి క్షణంలో వెనకడుగు వేసింది.