పాక్ లోని మసీదులో ఆత్మాహుతి దాడి.. 28 మంది మృతి

ఒకవంక ఆర్ధిక సంక్షోభం, ఆహార కొరత, ఇంధనం సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్ ను ఇప్పుడు ఉగ్రవాదభూతం కూడా వెంటాడుతున్నది. పెషావర్‌లోని ఓ మసీదు వద్ద సోమవారం జరిగిన భారీ పేలుడులో 28 మంది చనిపోయారు. 120 మందికి పైగా గాయపడ్డారు.
 
పెషావర్ సిటీలోని స్థానిక పోలీసు కార్యాలయంలో ఉన్న మసీదులో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం ప్రార్థనలు చేసేందుకు 260 మంది వరకు రాగా..ప్రార్థనలు చేస్తున్న టైములో ముష్కర మూకలు ఆత్మాహుతి దాడికి తెగబ్డాయి. ఈ దాడిలో దాదాపు 28 మంది వరకు మరణించినట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వీరిలో ఎక్కువ మంది పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా జనం ఆర్తనాదాలు, హాహాకారాలతో దద్దరిల్లింది. పేలుడు తర్వాత మసీదు భవనంలోని కొంత భాగం దెబ్బతిని శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్టు పోలీస్ అధికారి సికిందర్ ఖాన్ తెలిపారు. పేలుడు ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పెషావర్‌లోని సమీప ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. గతేడాది మార్చిలో పెషావర్ లోనే షియాలకు చెందిన మసీదుపై ఐసిస్ ఆత్మాహుతి చేయగా.. 64 మందికి పైగా చనిపోయారు. మసీదు భవనంలోని ఓ భాగం కుప్పకూలిపోయిందని, శిథిలాల క్రింద కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని  పోలీసులు తెలిపారు. పోలీస్ చీఫ్ ముహమ్మద్ ఇజాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ మసీదు ఆఫ్ఘనిస్థాన్ సమీపంలో ఉందని పేర్కొన్నారు.