పాకిస్తాన్‌ లో మేలో 27 శాతం పెరిగిన ఉగ్రవాద దాడులు

పాకిస్తాన్‌ లో మేలో 27 శాతం పెరిగిన ఉగ్రవాద దాడులు
ఏప్రిల్‌ ‌నెల కంటే మే నెలలో పాకిస్తాన్‌ ఉగ్రవాద ప్రేరేపిత హింస 27 శాతం పెరిగిందని తాజాగా థింక్‌ ‌ట్యాంక్‌ ‌నివేదిక వెల్లడించింది. కొద్దికాలం పాటు సాపేక్ష క్షీణత తర్వాత, మే నెలలో మిలిటెంట్, ఉగ్రవాద గ్రూపులు తిరిగి పుంజుకున్నాయని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (పిఐసిఎస్‌ఎస్‌) విడుదల చేసిన నెలవారీ భద్రతా అంచనా నివేదిక పేర్కొంది. 

ఈ నివేదిక ప్రకారం ఒక్క మే నెలలోనే 128 ఉగ్రదాడులు జరిగాయి. ఏప్రిల్‌‌లో 101 దాడులు జరిగాయి. దీంతో ఏప్రిల్‌ ‌నెలకన్నా మే నెలలో జరిగిన ఉగ్రదాడులు 27 శాతం మేర పెరిగాయని ఈ నివేదిక తెలిపింది. ఈ దాడుల వల్ల మేలో 71 మంది పౌరులు, 68 భద్రతా సిబ్బంది, శాంతి కమిటీలకు చెందిన ఆరుగురు మృతి చెందారు. ఇక 147 మంది పౌరులు, 35 మంది భద్రతా సిబ్బంది, ముగ్గురు శాంతి కమిటీ సభ్యులు గాయపడ్డారు.

ఏప్రిల్‌ ‌నెలతో పోలిస్తే మే నెలలో పౌరులు అత్యధిక మంది మృతి చెందారు. ఏప్రిల్‌‌లో 37 మంది చనిపోతే, మే నెలలో 71 మంది.. సుమారు 92 శాతం మేర పౌరుల మరణాల రేటు పెరిగింది. ఇక భద్రతా సిబ్బంది ఏప్రిల్‌‌లో 28గా ఉంటే.. మేకి 68 మంది మృతి చెందారు. వీరి మరణాల రేటు 143 శాతం పెరిగింది. పాకిస్తాన్‌‌లో మే నెలలో ఆరు ఆత్మాహుతి దాడుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 34 మంది సెక్యూరిటీ సిబ్బంది, 9 మంది పౌరులు మృతి చెందారు.

ఈ ఏడాది మార్చి- ఏప్రిల్‌ ‌నెలల్లో ఒక్కొక్కటి మాత్రమే నమోదైంది. దీనిబట్టి చూస్తే ఉగ్రవాద గ్రూపులు పాల్పడే ఆత్మాహుతి దాడులు కూడా పెరిగాయని అర్థమౌతుంది.  ప్రత్యేకించి ఉగ్రదాడుల్లో బలూచిస్తాన్‌‌లోనే అత్యధికంగా ఉగ్రదాడులు జరిగాయి. ఏప్రిల్‌ ‌నెలలో 34 దాడులు జరిగితే, మే నెల్లో ఈ ప్రావిన్స్‌‌లో 71 ఉగ్రదాడులు జరిగాయి. క్రితం నెలతో పోలిస్తే 109 శాతం పెరుగుదల నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది. బలూచిస్తాన్‌‌లో కిడ్నాప్‌‌లు కూడా ఎక్కువగా జరుగుతాయి.

దేశవ్యాప్తంగా కిడ్నాప్‌‌ల సంఖ్య 54 అయితే ఒక్క బలూచిస్తాన్‌‌లోనే 52కి చేరడం గమనార్హం.  ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతూ ఉండడంతో  భద్రతా దళాలు యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్‌‌ని ముమ్మరం చేశాయి. పిఐసిఎస్‌ఎస్‌ ‌నివేదిక ప్రకారం భద్రతా దళాలు తీవ్రవాదుల్ని 270 మందిని చంపాయి. 15 మందిని అరెస్టు చేశాయి. హతమైన వారిలో ఫటా జిల్లాలో 128, ఖైబర్‌ ‌ఫంక్తున్‌ఖ్వా 62, బలూచిస్తాన్‌ 71, ఒకరు పంజాబ్‌ ‌ప్రావిన్స్‌‌లో ఉన్నారు.