అవినాష్ రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన సిబిఐ

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి డా. వి ఎస్  వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు వైస్సార్సీపీ ఎంపీ, వరుసకు జగన్ కు సోదరుడైన వై ఎస్ అవినాష్ రెడ్డిని శనివారం దాదాపు నాలుగున్నర  గంటలపాటు విచారించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించడం జరిగింది.

హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని సీబీఐ బృందం నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు తెలిసిన అన్ని విషయాలను సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరానని, కానీ రికార్డింగ్ కు సీబీఐ అధికారులు అంగీకరించలేదని తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తానని తెలిపినట్లు అవినాష్ చెప్పారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పారని వెల్లడించారు. విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐ అధికారులను కోరినట్లు చెప్పారు. అయితే, దర్యాప్తుకు  సంబంధించిన విషయాలు బహిర్గతం చేయలేనని స్పష్టం చేశారు.

వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఇప్పటికే 248 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ఆయా వాంగ్మూలాల ఆధారంగానే సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. తమ నేతను విచారిస్తున్న నేపథ్యంలో, కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్దకు అవినాశ్ రెడ్డి అనుచరులు భారీగా తరలివచ్చారు.

మరోవంక, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు విచారణ ప్రక్రియను ప్రారంభించింది. వివేకా హత్య కేసులో ప్రధాన, అనుబంధ చార్జ్‌షీట్ విచారణకు కోర్టు స్వీకరించింది. ఈ కేసుకు SC/01/2023 నెంబర్‌ను న్యాయస్థానం కేటాయించింది. వివేకా కేసులో ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
 
ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి, శివశంకర్‌రెడ్డికి సమన్లు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 10న విచారణకు హాజరుకావాలని నిందితులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేక హత్య కేసును కడప నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే.