తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు, కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి నివేదిక ఇచ్చానని గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ వెల్లడించారు. రిపబ్లిక్ దినోత్సవం జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని ఆమె ధ్వజమెత్తారు.
కరోనా పేరుతో పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తూ, రాజ్ భవన్ కు పరిమితం చేయడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిపబ్లిక్ వేడుకలు జరపడం ఇష్టంలేని రాష్ట్ర సర్కారు వేడుకలు నిర్వహించకపోవడానికి చెప్పిన సాకు నవ్వు తెప్పించిందని అంటూ ఆమె తెలిపారు.
5 లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని గుర్తు చేస్తూ ఖమ్మం సభకు లేని కరోనా రిపబ్లిక్ డేకు గుర్తు వచ్చిందా? అని పుదుచ్చేరి గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుంచి రాజ్‌భవనంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడంలేదని తమిళిసై ఆరోపించారు.
అభివృద్ధి అంటే భవనాల నిర్మాణాలు కాదని, జాతి నిర్మాణం అని తమిళిపై పేర్కొంటూ ఫామ్‌హౌస్‌లు కట్టడం కాదని, అందరికి ఫార్మ్‌లు కావాలని, రైతులు, పేదలు అందరికీ భూములు, ఇళ్లు కావాలని గవర్నర్ తెలిపారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం అభివృద్ధి కాదని.. రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలని తమిళిసై స్పష్టం చేశారు.
రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని ఆమె సూచించారు. రాష్త్ర ప్రభుత్వం తన విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని పేర్కొంటూ ఈ విషయంలో కలెక్టర్, ఎస్పీలతో సహా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొనే అధికారం తనకు ఉందని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఎవరివో ఆదేశాలు పాటించిన అధికారులను శిక్షించడం సరికాదని తాను వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె తెలిపారు.
తమిళనాడులో ఇటీవల ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఏకంగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయినా.. గణతంత్ర దినోత్సవానికి సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు, అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా మధ్య పొరపొచ్చాలున్నా.. రిపబ్లిక్ డే ఉత్సవాలకు కేజ్రీవాల్ హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, కేరళలో పినరయి విజయన్ కూడా గవర్నర్ల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయినా, గణతంత్ర దినోత్సవాలకు, ఎట్ హోంకు హాజరయ్యారు.
ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ సభలోనూ కేజ్రీవాల్, విజయన్ ఈ అంశంపై మాట్లాడారు. అయినా ఆయా రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవానికి వీరు హాజరయ్యారు. రాజ్యాంగపరమైన విధిని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు పాటించారు. కానీ, రాష్ట్రంలో హైకోర్టు ఆదేశించినా గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలోనే, వేడుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా పరిగణించారు.
తన పట్ల ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలా వ్యవహరించినా భరించానని, కానీ.. గణతంత్ర దినోత్సవం విషయంలో ప్రభుత్వ తీరు సమర్థనీయం కాదన్న అభిప్రాయానికి ఆమె వచ్చినట్లు తెలుస్తోంది. వరుస పరిణామాలతో నొచ్చుకున్న గవర్నర్.. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గణతంత్ర దినోత్సవంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి గవర్నర్‌ను తీవ్ర ఆందోళనకు, అసంతృప్తికి గురి చేసినట్లు తెలుస్తోంది.
అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ కేంద్రానికి నివేదించారు. జాతీయ పండుగకు ఇవ్వాల్సినగౌరవం ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించలేదని ఫిర్యాదుచేశారు. కార్యక్రమానికి సీఎం, మంత్రులు హాజరు కాకుండా అవమానించారని తెలిపారు.
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్