‘హల్వా వేడుక’తో లాంఛనంగా మొదలైన బడ్జెట్ కార్యక్రమాలు

బడ్జెట్ 2023-24 కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుకతో ప్రారంభించారు. పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరీ, భగవత్ కిషన్ రావు కరాడ్ పాల్గొన్నారు.
 
ఆర్ధిక కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు, బడ్జెట్ తయారీ ప్రక్రియలో ఉన్న సిబ్బంది పాల్గొన్నారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో హల్వా వేడుక కూడా కీలక ఘట్టం. అయితే, గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణాల వల్ల హల్వా వేడుక జరగలేదు. మరోవైపు ఈ హల్వా వేడుకతో ఆర్థిక ఏడాదికి ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్ కాగితాలు ముద్రిస్తారు. కానీ, గత రెండు బడ్జెట్ల నుంచి డిజిటల్‌గా ప్రవేశపెట్టున్నారు.
 
చేపట్టిన పని విజయవంతంగా పూర్తయితే నోరు తీపి చేసుకుంటాం. అలా కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌కు సంబంధించి కూడా హల్వా వేడుక చేస్తారు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా ఈ హల్వాను తయారు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులంతా ఈ వేడుకలో భాగస్వాములవుతారు. హల్వా వేడుకలో పాల్గొన్న మంత్రులు, అధికారులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా హల్వా అందించారు.

‘ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్‌లో యూనియన్ బడ్జెట్ 2023-24 తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకున్న క్రమంలో హల్వా వేడుక నిర్వహించారు. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌధరి, భగవత్ కిషన్ రావు కరాడ్ పాల్గొన్నారు.’ అని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన చేసింది.
సీతారామన్‌కు ఇది వరుసగా ఐదో బడ్జెట్‌. గత రెండు బడ్జెట్‌ల మాదిరిగానే ఈ ఏడాది యూనియన్ బడ్జెట్ 2023-24 సైతం పేపర్ లెస్‌గా డిజిటల్‌గా ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి. ఫిబ్రవరి 1, 2023న పార్లమెంట్‌లో ఆవిష్కరిస్తారు. గత ఏడాది బడ్జెట్ గురించిన వివరాలు ప్రజలు అందుబాటులో ఉంచేందుకు మొబైల్ యాప్ తీసుకొచ్చింది కేంద్రం.
అందులో ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లకు సంబంధించిన గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్స్ వంటివన్నీ అందులో ఉంటాయి. ఈ యాప్ ఇంగ్లీష్‌తో పాటు హిందీలోనూ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ ఫామ్‌లో ఈ యాప్ ఉంటుంది. దీనిని యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ www.indiabudget.gov.in నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
 
ప్రధాని న‌రేంద్ర‌మోదీ 2.0 క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యత‌లు స్వీక‌రించిన నిర్మలా సీతారామ‌న్ బుధవారం ఐదో వార్షిక బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను పార్లమెంట్‌కు స‌మ‌ర్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందిరాగాంధీ త‌ర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యత‌లు స్వీక‌రించిన మ‌హిళా నాయ‌కురాలిగా నిర్మలా సీతారామ‌న్ రికార్డు నెల‌కొల్పారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో మాస్టర్స్ ప‌ట్టా అందుకున్నారు నిర్మల‌మ్మ.
తొలుత లండన్ లోని ఓ స్టోర్‌లో పని చేశారు. తర్వాత యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)లో వ్యవసాయ ఇంజనీర్ల సంఘం అసోసియేషన్ ఆర్థిక సలహాదారుగా సేవలందించారు. మోదీ తొలి స‌ర్కార్‌లో తొలుత ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా, తదుపరి రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.