తెలంగాణాలో పరిస్థితుల పట్ల గవర్నర్ తమిళసై ఆందోళన

తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని గవర్నర్ డా. తమిళ సై సౌందరరాజన్ ఆరోపించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణలో ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో తన పాత్ర కూడా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ రాజ్ భవన్‌లో 74వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీ కుమార్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు లక్ష్యంగా కొన్ని వాఖ్యలు చేశారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె అభిలాష వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై తీవ్ర స్థాయిలో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేయడం, నిజాయితీ తనకు ఉన్న బలాలు అని పేర్కొంటూ తనకు తెలంగాణ అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పారు. కొందరికి తనంటే ఇష్టం ఉండకపోవచ్చని, అయితే తెలంగాణ అభివృద్ధిలో ఖచ్చితంగా తన పాత్ర ఉంటుందని చెప్పారు. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదని, జాతి నిర్మాణం అంటూ పరోక్షంగా నూతన సచివాలయం గురించి ప్రస్తావించారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు కేటాయిస్తున్న ప్రధాని మోదీక గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.

అందరికి అభివృద్ధి కావాలని, కొందరికి మాత్రమే పరిమితం కాకూడదని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఫామ్ హౌస్‌ల నిర్మాణం, భవనాలు కట్టడం మాత్రమే అభివృద్ధి కాదని సగటు ప్రజల అకాంక్షలు కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంటూ ఆమె కేసీఆర్ కు చురకలు అంటించారు.  తెలంగాణతో తనకున్న బంధం మూడేళ్లది మాత్రమే కాదని పుట్టుకతోనే తనకు తెలంగాణతో బంధం ఏర్పడిందని చెబుతూ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ ప్రజల అభివృద్ధికి తాను కృషి చేస్తానని గవర్నర్ చెప్పారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ జాతీయ జెండా ఎగురవేశారు.