అన్ని ప్రతిపక్ష పార్టీల్లోనూ కేసీఆర్ కోవర్టులు

సీఎం కేసీఆర్‌ అన్నిప్రతిపక్ష పార్టీల్లోనూ ఇన్‌ఫార్మర్లు, కోవర్టులను పెట్టుకున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ వంటి పార్టీల్లో నేతల మధ్య తగవులు ఉన్నాయంటూ వారితో కథనాలను ప్రచారం చేయిస్తారని, ఈ పార్టీల కంటే చివరకు కేసీఆరే దిక్కు అని ప్రజలు అనుకునేలా వారు ప్రచారం చేస్తారని ఆయన హెచ్చరించారు.

తన కదలికలపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నిఘా పెట్టారని చెబుతూ 2018 ఎన్నికల సందర్భంగా గోల్కొండ హోటల్‌లో కొంతమంది ఇంటెలిజెన్స్‌ అధికారులే తనకు టీ కప్పులు అందించారని వెల్లడించాయిరు. కొందరు పోలీసు అధికారులు కేసీఆర్‌కు బానిసలుగా మారారని ఈటల ధ్వజమెత్తారు. కొన్ని కేసుల్లోనైతే ఏ సెక్షన్లు పెట్టాలో కూడా కేసీఆరే సూచిస్తున్నారని చెప్పారు.

కేసీఆర్‌ రాజ్యంలో రూ.వంద కోట్లు ఉంటేనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి ఏర్పడిందని ఈటల ఆరోపించారు. ఏ పార్టీ ఎక్కువ డబ్బు ఇస్తే.. ఆ పార్టీకే ఓటేస్తామని ప్రజలే చెప్పే పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. మునుగోడులో ఇదే జరిగిందని, ఈ దుర్నీతిని దేశంపై రుద్దేందుకే బీఆర్‌ఎస్‌ పార్టీని పెట్టారని ఆరోపించారు.  ‘‘కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌, ఏపీ, యూపీ, బెంగాల్‌ రాష్ట్రాల్లో ఎన్నికలకు తెలంగాణ నుంచి డబ్బులు పంపిస్తారా? ఇదేమైనా మీ తాత జాగీరా? ప్రజలు చెమటోడ్చిన సొమ్ములు కాదా?’’ అని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.లక్షల కోట్ల అక్రమ సంపాదనతో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ చెరబట్టారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ధరణిని తీసుకువచ్చి రూ.లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, వాటిని అమ్ముకుని, తెలంగాణ ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారని ధ్వజమెత్తారు.

అటుకులు బుక్కి ఉద్యమం చేసినట్లు చెప్పుకొన్న కేసీఆర్‌కు ఇంత తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్ల డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలని సవాల్ చేశారు. పార్టీ ఫండ్‌గా రూ.850 కోట్లు ఎవరిచ్చారు? ఎప్పుడిచ్చారు? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టుపక్కల కొల్లగొట్టిన ప్రభుత్వ భూములు, ఎల్లమ్మబండ భూములు, ధరణి వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

గోదావరి వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో మునిగిన పంపులు, వాటిల్లిన నష్టాన్ని తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, నష్టంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడం రాచరికపు పోకడలకు పరాకాష్ఠ అని ఈటల ధ్వజమెత్తారు.