సర్పంచ్ ల నిధులు, అధికారాలు దోపిడీ చేస్తున్న తెలుగు ప్రభుత్వాలు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సర్పంచుల నిధులు, విధులు, అధికారాలను దోపిడీ చేస్తున్నాయని పేర్కొంటూ సర్పంచులకు న్యాయం జరిగే వరకూ రాజీలేని పోరాటం సాగిస్తామని పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు వై. వి. బి. రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.  హైదరాబాద్ లో తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్, తెలంగాణ సర్పంచుల సంఘం సమక్షంలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
 
ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు తెలంగాణ సర్పంచుల హక్కుల కోసం చేసే ఉద్యమాలకు, పోరాటాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.  సందర్భంగా బాబు రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ తెలంగాణలో రూ. 3,000 కోట్లు, ఆంధ్రాలో రూ. 8660 కోట్లకు పైగా సర్పంచుల ఖాతాల నుంచి ఆయా ప్రభుత్వాలు నిధులను కొల్లగొట్టాయని ధ్వజమెత్తారు.
 
తిరిగి సర్పంచుల ఖాతాల్లో జమ చేసే వరకూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ రాజకీయాలకు అతీతంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. ధనిక రాష్ట్రం అని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ఆర్ బాటలోనే పాలన సాగిస్తున్నామని పదే పదే వల్లెవేస్తున్న జగన్ గ్రామ పంచాయతీలకు ఉచిత విద్యుత్ పై ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విడుదల చేసిన జీవోను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
 
రాష్ట్రాల గ్రాంటు ఇవ్వకుండా, కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను కాజేస్తూ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ సర్పంచుల అధికారాలను కాలరాస్తూ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్న ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు తగిన ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
 
 అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరెడ్డి, బూర నర్సయ్య గౌడ్ (బిజెపి), పారిజాతా నర్సింహారెడ్డి (కాంగ్రెస్ మేయర్ – బడంగ్ పేట్ ), మల్లారెడ్డి (సిపిఎం), సాంబ శివరావు(సీపీఐ ), విమలక్క (అరుణోదయ), ఝాన్సీ ( న్యూ డెమోక్రసీ), గట్టు రామచంద్రరావు (వై.ఎస్. ఆర్ టీపి ), డి. దయానంద రావు, విజయార్య క్షత్రియ (బిఎస్పీ), అన్వేష్ (సిపిఎం ప్రజా పంథా) పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్ కూడా పాల్గొన్నారు.