క‌లుషిత ఔష‌ధాల‌పై డబ్ల్యుహెచ్ఓ ఆందోళన

కొన్ని దేశాల్లో క‌లుషిత ద‌గ్గు మందు తాగి ప‌దుల సంఖ్య‌లు చిన్నారులు మ‌ర‌ణించడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కలుషిత ఔషధాలపై ప్రపంచ దేశాలు తక్షణం చర్యలు తీసుకోవాలని సంస్థ కోరింది. చిన్నారుల మృతికి కారణమైన దగ్గు సిరప్‌ల తయారీ సంస్థల మధ్య ఏదైనా సంబంధం ఉందా అని చర్యలు చేపట్టాల్సిందిగా ఆయా దేశాలను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
 
చిన్నారుల మరణాలు జరగకుండా నిరోధించాల్సిన బాధ్యత ఉందని డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. సభ్య దేశాలు తమ మార్కెట్లలో పంపిణీలో ఉన్న అన్ని ఔషధాలను తనిఖీ చేసి, ప్రమాణాల మేరకు లేని, కలుషిత ఉత్పత్తులను తొలగించాలి. విక్రయించే అన్ని ఉత్పత్తులు కూడా ఆయా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకున్నవి అయి ఉండాలి.
 
తయారీ కేంద్రాల తనిఖీలో ప్రమాణాలు మరింత మెరుగుపరచాల‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. ఈ మేరకు మొత్తం మూడు అలర్ట్ లు జారీ చేసింది. గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాల్లో దగ్గు మందు తాగిన ఐదేళ్లలోపు 300 మంది చిన్నారులు కిడ్నీలు దెబ్బతిని చనిపోయినట్టు ప్రంపచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
 
గాంబియా, ఉబ్బెజిస్థాన్ లో మరణాలకు భారత్ కు చెందిన ఫార్మా కంపెనీల దగ్గు మందులు కారణమనే ఆరోపణలు రావడం తెలిసిందే. జులై 2022లో గాంబియాలో మొదటగా మరణాలు నమోదయ్యాయి. అయితే చిన్నారులు సాధారణ దగ్గు కోసం తీసుకునే సిరప్‌లతో  మరణాలు ముడిపడి ఉన్నాయని డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది. కంబోడియా, ఫిలిప్పీన్స్‌, తూర్పు తైమూర్‌, సెనెగల్‌ నాలుగు దేశాలకు ఈ విచారణను విస్తరించినట్లు ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ మందుల్లో డైథైలిన్‌ గ్లైకాల్‌/ ఇథిలీన్‌ గ్లైకాల్‌ అనే విషపదార్థం మోతాదుకు మించి ఉందని పరీక్షల్లో తేలింది.ఈ కలుషితాలు ప్రమాదకర రసాయనాలు అని, కొద్ది మోతాదులో తీసుకున్నా ప్రాణ ప్రమాదం ఏర్పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

నాసిరకం మందులు నిర్మూలించేందుకు, నియంత్రించేందుకు తనిఖీలు ప్రారంభించాలని ఆయా దేశాల ప్రభుత్వాలకు ప్రపంచ ఔషధ పరిశ్రమ పిలుపునిచ్చింది. భారతదేశానికి చెందిన మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌, మారియన్‌ బయోటెక్‌ కంపెనీలు మరణాలనతో ముడిపడి ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు కంపెనీలను మూతపడ్డాయి. అయితే మైడెన్‌ ఉత్పత్తుల్లో ఎలాంటి సమస్యలు లేవని డిసెంబర్‌లో భారత్‌ ప్రకటించింది.