పాక్ ప్రధాన నగరాల్లో అలుముకున్న చీకట్లు!

దాయాదిదేశం పాకిస్థాన్‌లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దాదాపు దేశమంతా భారీగా విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. రాత్రివేళ్లలో పూర్తిగా విద్యుత్ సరఫరా బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో సోమవారం దేశంలో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఏకంగా ప్రధాన నగరాలకు విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది.
 
అక్కడ ప్రధాన నగరాల్లో విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీంతో కరాచీ, లాహోర్‌, ఇస్లామాబాద్‌ తదితర నగరాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఆయా నగరాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా పూర్తిస్థాయిలో విద్యుత్ నిలిచిపోవడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి.
 
పవర్‌ గ్రిడ్‌ ఫెయిల్యూర్‌ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ‘ఈ రోజు ఉదయం 7:34 గంటల సమయంలో నేషనల్‌ పవర్‌ గ్రిడ్‌ నుంచి ఫ్రీక్వెన్సీ పడిపోవడంతో పవర్‌ గ్రిడ్‌ డౌన్‌ అయ్యింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం’ అని మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

దేశంలోని పలు విద్యుత్ పంపిణీ సంస్థలు అంతకుముందే విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయాన్ని ధ్రువీకరించాయని జియో టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. గుడ్డు, క్వెట్టాల నగరాల మధ్య విద్యుత్ సరఫరా చేసే రెండు లైన్లు ట్రిప్ అయ్యాయని, దీంతో సరఫరా నిలిచిపోయిందని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ వెల్లడించింది.

బలూచిస్థాన్‌లోని 22 జిల్లాలకు విద్యుత్ సరఫరా ఆగిందని పేర్కొంది. లాహోర్, కరాచీలోని పలు ప్రాంతాల్లోనూ చీకట్లు అలుముకున్నాయని అధికారులు వివరించారు. ఇస్లామాబాద్ లోని 117 గ్రిడ్ స్టేషన్లతో పాటు పెషావర్ లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు.

కాగా, పాక్‌ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక రంగం కుదేలవడం, నిరుద్యోగం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో పొదుపు మంత్రం పాటిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా విద్యుత్తు రంగంలో భారీగా పేరుకుపోతున్న రుణాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు కీలక ప్రతిపాదనలను ప్రకటించింది. మార్కెట్లు‌, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పెండ్లి మండపాళ్లు రాత్రిపూట తెరిచి ఉంచడంపై ఆంక్షలు విధించింది. రాత్రి 8:30 గంటలకల్లా షాపింగ్ మాల్స్, రాత్రి పది దాటేలోగా పెండ్లి మండపాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లు, మ్యారేజీ హాళ్లు, షాపింగ్ మాల్స్‌ను రాత్రిపూట త్వరగా మూసేయడం ద్వారా దాదాపు రూ.6 వేల కోట్లు పొదుపు చేయొచ్చని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి క్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు.

మరోవంక, విలాసవంతమైన కార్లు, హై ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడిభాగాలను దిగుమతి చేసుకునేందుకు దేశం ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు (రూ.259 బిలియన్లు) ఖర్చు చేసింది. తిండి లేక అల్లాడిపోతున్న వేళ కార్ల దిగుమతి ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

పాకిస్థాన్‌లో విదేశీ మారక నిల్వలు 4 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. ఫలితంగా నిత్యావసరాలను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం నానా కష్టాలు పడుతోంది. ఫలితంగా నిత్యావసరాలను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం నానా కష్టాలు పడుతోంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో దేశ ప్రజలు ఇలా బిలియన్ల రూపాయలను లగ్జరీ కార్ల కోసం వెచ్చించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.