కాంగ్రెస్‌కు ఎకె ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి ఎకె ఆంటోని కుమారుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అనిల్ ఆంటోని బుధవారం కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక చెంచాగా తాను పనిచేయలేనని, భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న విధ్వంసకర వ్యాఖ్యానాలలో భాగస్వామ్యం కావడం కన్నా స్వతంత్రంగా తన వృత్తిని కొనసాగిస్తానని స్పష్టం చేస్తూ అనిల్ ఆంటోని ట్వీట్ చేశారు.

గుజరాత్ అల్లర్లపై బిబిసి తీసిన డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనిల్ ఆంటోని మంగళవారం సమర్థించారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేరళ రాష్ట్రంలో ప్రదర్శిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా దాన్ని వ్యతిరేకించారు. బీబీసీ డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడే అని అనిల్ ఆంటోనే ఆరోపించారు.

భారత్‌లో అంతర్గతంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ విదేశీ మీడియా జోక్యం చేసుకుని విభేదాలు సృష్టించే అవకాశం కల్పించరాదని అనిల్ కె ఆంటొనీ స్పష్టం చేశారు. 20 ఏళ్ల కిందట జరిగిన దానిపై ఇప్పుడు రాద్ధాంతం ఎందుకని ఆయన ప్రశ్నించారు. భారత్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉందని గుర్తు చేశారు.   ఎన్డీటీవీతో అనిల్ ఆంటోనీ మాట్లాడుతూ రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ తనకు ఏ సమస్య లేదని పేర్కొరు.

కానీ, 75 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో విదేశీయులను లేదా వారి సంస్థలను మన సార్వభౌమత్వాన్ని అణగదొక్కడానికి లేదా మన సంస్థలను నాశనం చేయడానికి అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఒక వంక రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ డాక్యుమెంటరీని ఆధారం చేసుకొని ప్రధాని నరేంద్ర మోదీపై రాజకీయ దాడులకు దిగుతుండగా, ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత కుమారుడి నుండి ఈ విధమైన సమర్ధన వ్యక్తం కావడం బీజేపీ వర్గాలలో ఉత్సాహం కలిగిస్తున్నది.

భారతదేశ సార్వభౌమత్వంపై రాజీపడే ప్రసక్తి లేదంటూ అనిల్ ట్వీట్ చేయగా ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ నుంచి ఆయనపై ఒత్తిడి వచ్చింది.
అనిల్ ఆంటోని ప్రస్తుతం కేరళ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా కన్వీనర్ పదవితో పాటు ఎఐసిసి సోషల్ మీడియా అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సెల్ జాతీయ కోఆర్డినేటర్ పదవిని నిర్వహిస్తున్నారు. ఈ రెండు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు.