భారత్- పాక్ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ ‘ఆపరేషన్ అలర్ట్’‌

భారత గణతంత్ర దినోత్సవాలను దృష్టిలో ఉంచుకుని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ ఏడు రోజుల ‘ఆపరేషన్ అలర్ట్’‌ను ప్రారంభించింది. గుజరాత్‌లోని కచ్, రాజస్థాన్‌లోని బర్మెర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ఈ ఆపరేషన్ అలర్ట్‌లో పాల్గొంటున్నారు. ఇండో-పాక్ సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచారు.

శనివారంనాడు ప్రారంభమైన ఈ ‘ఆపరేషన్ అలర్ట్’ ఈనెల 28వ తేదీ వరకూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా సంఘ వ్యతిరేక శక్తుల దుశ్చర్యలు తిప్పికొట్టేందుకు ‘ఈపరేషన్ అలర్ట్’ నిర్వహిస్తున్నట్టు బీఎస్ఎఫ్ గుజరాత్ ఫ్రాంటియర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాత్‌లోని కచ్ వెంబడి ఇండో-పాక్ సరిహద్దును అత్యంత సున్నితమైన ప్రాతంగా భావిస్తుంటారు.

చేపల వేట కోసం బోట్లపై భారత జలాల్లోకి పాక్ జాతీయులు అనేకమార్లు అడుగుపెట్టడం, పట్టుబడటం వంటివి జరిగాయి. ఒక్క 2022లోనే గుజరాత్ ప్రాంతంలో 22 మంది పాక్ మత్స్యకారులను పట్టుకుని, 79 పడవలను, రూ.250 కోట్లు విలువచేసే హెరాయిన్, రూ.2.49 విలువచేసే మాదకద్రవ్యాలను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది.

కాగా, సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచడంలో భాగంగా వ్యూహాత్మకమైన సర్ క్రీక్, హరామీ నాలా ఏరియాలో ‘పెర్మనెంట్ వర్టికల్ బంకర్స్’ నిర్మాణం జరగుతున్నట్టు బీఎస్ఎఫ్ వర్గాలు గతంలో తెలిపాయి. బుజ్ సెక్టార్ వెంబడి 8 మల్టీ-స్టోరీ బంకర్లు-అబ్జర్వేషన్ పోస్టుల నిర్మాణానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూ.50 కోట్ల మేరకు నిధులు కూడా మంజూరు చేసింది. పాకిస్థాన్ మత్స్యకారులు, పడవల చొరబాటు నిరంతరాయంగా సాగుతున్న నేపథ్యంలో గట్టి నిఘా, చర్యల కోసం హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

విమానం తరహా బెలూన్ స్వాధీనం

ఇలా ఉండగా, జమ్మూకశ్మీర్‌‌లోని కౌర్ ఏరియాలో అనుమానాస్పద బెలూన్‌ను పోలీసులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు. విమానం ఆకారంలో ఉన్న ఈ బెలూన్‌పై ‘పీఐఏ’  అని రాసి ఉండటంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ని పీఐఏగా పిలుస్తుంటారు. గతంలో కూడా జమ్మూలోయలో ఈ తరహాలో పలు బెలూన్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

అయితే, గత శనివారంనాడు నార్వాల్‌లో జంట కారు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్‌లైన్స్ తరహా బెలూన్ కనిపించడంతో పోలీసు యంత్రాంగం ఆరా తీస్తోంది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కొనసాగుతుండటం, రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో నార్వాల్‌ లోని ట్రాన్స్‌పోర్ట్ యార్ట్‌లో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడం శనివారం సంచలనమైంది.

రిపైర్ల కోసం వర్క్‌షాప్‌కు పంపిన వాహనంలో ఉదయం 10.45 గంటలకు తొలి పేలుడు సంభవించిందని, మరో 15 నిమిషాలకు ఆ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద రెండో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షి జస్విందర్ సింగ్ తెలిపారు. తొలి పేలుడు ఘటనలో ఐదుగురు, రెండో పేలుడుకు మరో ఇద్దరు గాయపడ్డారు.