పోరుబాటలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రతి నెల వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతుండటం, డిఏ బకాయిలు పేరుకుపోవడం, జిపిఎఫ్‌ ఖాతాలు ఖాళీ కావడం వంటి కారణాలతో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.

బహుశా రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా గవర్నర్ ను కలిసి తమ సమస్యలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించేలా ఆదేశించాలని కోరారు. ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్ ను కలిశామని చెబుతున్నారు.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైందని ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 11వ పిఆర్‌సిలో ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు నష్టపోయారని, ప్రభుత్వం ఏదొక రూపంలో నష్టాన్ని భరించకపోతుందా అనే ఆశతో వేచి చూస్తున్నామని, విధిలేని పరిస్థితుల్లో ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెబుతున్నారు.

ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపు విషయంలో ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, నెలనెల జీతాలు ఆలశ్యంగా చెల్లిస్తుండటం, ఉద్యోగులు దాచుకున్న జిపిఎఫ్‌, ఏపిజిఎల్‌ఐ వంటి ఖాతాల్లో దాచుకున్న డబ్బును కూడా విత్‌ డ్రా చేయకుండా ప్రభుత్వం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త పిఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత నాలుగు డిఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10-12వేల కోట్ల రుపాయల వరకు ప్రభుత్వం వివిధ రూపాల్లో బకాయి పడిందని, వాటిని కూడా చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ పెద్దలు, ఆర్ధిక శాఖ అధికారులు, మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, వారు హామీలకు మాత్రమే పరిమితం అవుతున్నారని, ప్రభుత్వంతో చర్చలు, సమావేశాలు నిష్ప్రయోజనమని భావిస్తున్నామని ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలతో పాటు అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ ఫైనాన్షియల్ కోడ్‌లోని 72వ నిబంధన ప్రకారం ఉద్యోగులు, పెన్షన్లు, ఇతర క్లెయిమ్స్‌ను మొదటి హక్కుదారులుగా చేర్చాలని గవర్నర్‌ను కోరారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాలు తక్షణం విడుదల చేయాలని కోరుతూ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమని ప్రకటించారు.

గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిక

ఇలా ఉండగా, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన బండి శ్రీనివాసరావు ఉద్యోగసంఘాల నాయకులు గవర్నర్ ను కలవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు నిబంధనలు పాటించాలని, లేకపోతే వాటి గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
 
 సమస్యలపై పోరాటం చేసే సత్తా లేకే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. వారి వెనుక ఏ శక్తి ఉండి నడిపిస్తుందో ఉద్యోగులు గమనిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకూ మౌనంగా ఉన్నామని, ఇకపై ఇలాగే వ్యవహరిస్తే ఖబడ్డార్ అంటూ బండి హెచ్చరించారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, పరిష్కరించకపోతే తామూ ఉద్యమంలోకి వస్తామని చెప్పారు.