బృందా కారత్‌కు చేదు అనుభవం

సీపీఎం నాయకురాలు బృందా కారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆమెను వేదిక నుంచి వెళ్లిపోవాలని రెజ్లర్‌ బజరంగ్‌ పునియా కోరారు. తమ నిరసనను రాజకీయం చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.
 
భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూష‌ణ్‌పై మ‌హిళా రెజ్లర్లు లైంగిక ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లర్ వినేశ్ ఫొగ‌ట్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద భారీ నిర‌స‌న ప్రద‌ర్శన చేప‌ట్టారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్‌తో పాటు పలువురు కోచ్‌లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
 
కాగా, సీపీఎం నాయకురాలు బృందా కారత్‌, రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపేందుకు వారు నిరసన చేస్తున్న జంతర్‌ మంతర్‌ వద్దకు గురువారం వచ్చారు. నిరసన చేస్తున్న వేదికపైకి ఆమె వెళ్లగా, ఒలింపిక్స్‌తోపాటు, 2022 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెజ్లర్‌ బజరంగ్‌ పునియా అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసన వేదిక నుంచి దిగిపోవాలని బృందా కారత్‌ను కోరారు.
 
అలాగే రెజ్లర్ల నిరసనకు రాజకీయ రంగు పులమవద్దని సూచించారు. నిరసనలో పాల్గొన్న మరి కొందరు రెజ్లర్లు కూడా చేతులు జోడించి వేదిక నుంచి వెళ్లిపోవాలని బృందా కారత్‌ను అభ్యర్థించారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
 
ఇలా ఉండగా, మ‌హిళా రెజ్ల‌ర్లు లైంగిక ఆరోప‌ణ‌లు చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తున్నది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో జ‌ర‌గాల్సిన మ‌హిళ‌ల జాతీయ రెజ్లింగ్ కోచింగ్ క్యాంపును ర‌ద్దు చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో ఆ ఈవెంట్ జ‌న‌వ‌రి 18వ తేదీ నుంచి జ‌ర‌గాల్సి ఉంది. సుమారు 41 మంది రెజ్ల‌ర్లు, 13 మంది కోచ్‌లు, స‌పోర్ట్ స్టాఫ్ ఆ క్యాంపులో పాల్గొనాల్సి ఉంది.ఆ ఈవెంట్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించింది.  ఈ ఘ‌ట‌న ప‌ట్ల కేంద్ర క్రీడా మంత్రిత్వ‌శాఖ స్పందిస్తూ భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. 72 గంట‌ల్లోనే స‌మాధానం ఇవ్వాల‌ని క్రీడాశాఖ ఆదేశించింది.