ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే కొన్ని ప్రాంతాల వెనుకబాటు

కర్ణాటకను పాలించిన ఇతర పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దక్షిణాది రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వాలకు అభివృద్ధే ఏకైక ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.  వచ్చే మే నెలలో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో గురువారం కోడెకల్‌లో నీటిపారుదల, తాగునీరు, జాతీయ రహదారికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన జరపడం చేస్తూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధాని వివరించారు.
 
యాద్గిర్, ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించడం ద్వారా గత ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పించుకున్నాయని, అయితే తమ ప్రభుత్వం యాద్గిర్‌తో సహా దేశంలోని 100 జిల్లాలకు పైగా ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధిలో వెనుకబడిపోవడానికి ఇక్కడి గత ప్రభుత్వాలు వెనుకబాటుతనాన్ని దూరం చేయాలనే ఆలోచన కూడా చేయకపోవడమే కారణమని ఆరోపించారు.
 
కరెంటు, రోడ్డు, నీటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు అధికారంలో ఉన్న పార్టీలుత ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చాయని ప్రధాని విమర్శించారు. ఏ పార్టీ లేదా ప్రభుత్వాన్ని పేర్కొనకుండా, ప్రతి ప్రాజెక్ట్, కార్యక్రమం ఒక నిర్దిష్ట సామాజికవర్గానికి చెందిన ఓట్లను కేవలం ఒక బలమైన ఓటు బ్యాంకుగా ఎలా మార్చుకోవాలో అనే ప్రిజం ద్వారా చూశామని ధ్వజమెత్తారు.
 
తాము ఈ జిల్లాల్లో సుపరిపాలనపై దృష్టి పెట్టామని చెబుతూ అభివృద్ధి స్థాయిలో పనులు ప్రారంభమయ్యాయని మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించిన జిల్లాల అభివృద్ధి ఆకాంక్షను తాము ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు.
 
రానున్న 25 ఏళ్లపాటు కొత్త తీర్మానాలను నెరవేర్చేందుకు దేశం ముందుకు సాగుతోందని ప్రధాని చెప్పారు. ఈ 25 ఏళ్లు దేశంలోని ప్రతి ఒక్కరికీ అమృతం అని పేర్కొంటూ ఒక్కో రాష్ట్రానికి అమృత్ కాల్ ఉంది. అమృత్‌ కాల్‌లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలని పిలుపిచ్చారు.  దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం, ప్రతి రాష్ట్రం ఈ ప్రచారానికి సహకరించినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.పొలంలో పనిచేసే రైతు, పరిశ్రమల్లో పనిచేసే కూలీలు అందరి జీవితాలు బాగున్నప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.