ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కే వేధింపులు

కొన్ని రోజుల క్రితం 20 ఏళ్ల అంజలిని కారుతో ఢీకొట్టి కొన్ని కిలో మీటర్ల వరకు లాక్కెళ్లి ఆమె చావుకు కారణమైన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఈసారి ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కే చేదు అనుభవం తప్పలేదు. బుధవారం రాత్రి  దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతను స్వయంగా తెలుసుకునేందుకు ప్రయత్నించిన  స్వాతి మలివాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఒక డ్రైవర్‌ ఆమెను కారులోకి లాగేందుకు ప్రయత్నించాడు.
 
ఈ క్రమంలో స్వాతి మలివాల్‌ చేతిని పట్టుకుని కొంత దూరం వాహనంతో ఈడ్చుకెళ్లాడు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ హాస్పిటల్‌ సమీపంలో ఈ సంఘటన జరిగింది. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో తన బృందంతో కలిసి ఆమె బయటకు వెళ్లారు. ఎయిమ్స్‌ హాస్పిటల్‌ సమీపంలో తన బృందాన్ని దూరంగా ఉంచిన స్వాతి మలివాల్‌ ఒంటరిగా రోడ్డుపై ఉన్నారు. ఇంతలో బాలెనో కారులో అటుగా వచ్చిన 47 ఏళ్ల హరీశ్‌ చంద్ర, మద్యం మత్తులో ఆమెను వేధించాడు.
‘లిఫ్ట్ ఇస్తా దా…’అంటూ తన వాహనంలోకి ఎక్కాలంటూ బలవంతం చేశాడు. ఆమె నిరాకరించగా కారుతో కాస్త ముందుకు వెళ్లాడు. యూ టర్న్‌ తీసుకున్న అతడు మళ్లీ స్వాతి మలివాల్‌ వద్దకు వచ్చాడు. కారులోకి ఎక్కాలని మరోసారి ఆమెను బలవంతం చేశాడు.ఆమె చిర్రెతి అతడిని మందలించడానికి కారు కిటికీ వైపుకు వెళ్లగానే అతడు కారు అద్దాలు పైకి లేపేశాడు.
దాంతో ఆమె చేయి అందులో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ఆమెను దాదాపు 10 నుంచి 15 మీటర్ల వరకు లాక్కెళ్లాడు. ఈ విషయాన్ని స్వయంగా డిసిపి చందన్ చౌదరి తెలిపారు. కాగా, దూరంగా ఉన్న ఢిల్లీ మహిళా కమిషన్‌ బృందం దీనిని గమనించి వెంటనే స్పందించింది. ఆ కారును అడ్డుకుని నిలువరించింది.
మద్యం మత్తులో కారు డ్రైవింగ్‌ చేయడంతోపాటు డీసీడబ్ల్యూ చీఫ్‌ స్వాతి మలివాల్‌ను వేధించిన హరీశ్‌ చంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.