జేపీ నడ్డా పదవి కాలం జూన్, 2024 వరకు పొడిగింపు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆయన నేతృత్వంలో పార్టీ బలపడినట్లు పేర్కొంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు నడ్డాల నేతృత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోగలమనే ధీమాను వ్యక్తం చేసింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా  మాట్లాడుతూ, తమ పార్టీ జాతీయ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించినట్లు ప్రకటించారు.

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్న పార్టీ బిజెపి అని చెబుతూ బూత్ స్థాయి నుండి పార్టీ అధ్యక్ష పదవి వరకు క్రమంతప్పకుండా ఎన్నికలు జరుపుతూ ఉంటామని తెలిపారు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి పార్టీ అధ్యక్షుడుగా మూడేళ్లు చొప్పున  వరుసగా రెండుసార్లు పదవిని ఉండవచ్చు.

కనీసం 50 శాతం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు జరిగిన తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించవచ్చనే నిబంధన కూడా ఇందులో ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో అధ్యక్ష ఎన్నిక నిర్వహణ సాధ్యం కావడం లేదని అమిత్ షా మీడియా సమావేశంలో చెప్పారు.

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల వరకు పార్టీ జాతీయ అధ్యక్షునిగా నడ్డా కొనసాగుతారని చెప్పారు.జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించాలని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ప్రతిపాదించారని, అందుకు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని చెప్పారు. నడ్డా నాయకత్వంలో తాము బిహార్‌లో అత్యధిక స్ట్రైక్ రేటును సాధించామని, మహారాష్ట్రలో ఎన్డీయే విజయం సాధించిందని, ఉత్తర ప్రదేశ్‌లో తాము గెలిచామని, పశ్చిమ బెంగాల్‌లో తమ బలం పెరిగిందని చెప్పారు. అంతే కాకుండా గుజరాత్‌లో భారీ విజయాన్ని సాధించామని తెలిపారు.

మోదీ, జేపీ నడ్డాల నాయకత్వంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఎంపీ స్థానాల కన్నా ఎక్కువ స్థానాలు తమకు లభిస్తాయని చెప్పారు.

“మన కార్యకర్తల సామర్ధ్యంతో అమిత్ షా, జెపి నడ్డల నేతృత్వంలో పార్టీ కష్టపడి పనిచేస్తూ ప్రజల విశ్వాసం పొందుతూ, సమాజానికి సేవచేస్తూ ఉంటుందని భరోసా వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ ఇచ్చారు. ఓ శక్తివంతమైన, అభివృద్ధిచెందిన, సమ్మిళిత భారత్ నిర్మాణానికి మనం అంకితమై ఉన్నామని తెలిపారు.