ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడిన రష్యా.. 12 మంది మృతి

యుద్ధభూమి ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా క్షిపణుల మోతమోగించింది. నిప్రో పట్టణంలోని ఓ నివాస సముదాయంపై బాంబుల వర్షం కురిపించడంతో 12 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. దేశంలోని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడిందని తెలిపారు.
 
రాజధాని కీవ్‌లోని క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడులు చేసిందని వెల్లడించారు. జెలెన్‌స్కీ సొంతపట్టణమైన క్రివ్వీ రీహ్‌లో ఆరు ఇండ్లు ధ్వసమయ్యాయని తెలిపారు. దీంతో ఓ వ్యక్తి మరణించాడని చెప్పారు. అదేవిధంగా ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న మోల్డోవాలో కూడా క్షిపణులు పడ్డాయని ఆ దేశ అధ్యక్షురాలు మైయా స్యాండు ట్వీట్‌ చేశారు.

ఇలా ఉండగా, రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక సాయం నాటో మిత్ర దేశాల నుండి కొనసాగుతునే వుంది. ఒకవైపు రష్యా మిలటరీ కార్యకలాపాలు పర్యవేక్షించడానికి రొమేనియాకు నిఘా విమానాన్ని పంపించనున్నట్లు నాటో కూటమి శుక్రవారం తెలియచేయగా, మరోవైపు ట్యాంక్‌లు, శతఘ్ని వ్యవస్థలను అందచేస్తామని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ శనివారం హామీ ఇచ్చారు.

 
ఇదిలా వుండగా, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, ఇతర నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణి దాడులను కొనసాగిస్తూనే వుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైనప్పటి నుండి ఉక్రెయిన్‌ సరిహద్దు దేశమైన రొమేనియాలో నాటో తన బలగాలను బలోపేతం చేసింది.  ”మా అవాక్స్‌ (గాల్లోనే హెచ్చరికలు జారీ చేయగల, నియంత్రణ వ్యవస్థతో కూడిన విమానాలు) వందలాది కిలోమీటర్ల దూరంలో గల విమానాన్ని కూడా కనిపెట్టగలవు. నాటో నిరోధక, రక్షణ సామర్ధ్యానికి ఇవి కీలకమైన రీతిలో దోహదపడతాయి” అని నాటో ప్రతినిధి ఓనా లాంగెస్కూ ఒక ప్రకటనలో తెలిపారు.
 
బుఖారెస్ట్‌కి సమీపంలోని ఒటోపెనికి మంగళవారానికి ఈ విమానాలు చేరతాయి. అక్కడ నాటో బోయింగ్‌ అవాక్స్‌ దళంలో భాగమవుతాయి. అయితే రొమేనియా నుండి గస్తీకి ఎన్ని అవాక్స్‌ విమానాలను మోహరిస్తోందో నాటో వెల్లడించలేదు. ఒటపెనిలో రొమేనియా వైమానిక స్థావరంలో దాదాపు 180మంది సైనిక సిబ్బంది వుంటారు. పలు వారాల పాటు ఈ మిషన్‌ కొనసాగుతుందని నాటో తెలిపింది.
 
శనివారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో బ్రిటన్‌ ప్రధాని మాట్లాడారు. అనంతరం ఒక ప్రకటన చేస్తూ, ఛాలెంజర్‌ 2 ట్యాంక్‌లు, ఇతర శతఘ్ని వ్యవస్థలను కీవ్‌కు అందచేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎన్ని ట్యాంకులు అన్న వివరాలు ఆయన వెల్లడించలేదు. అయితే బ్రిటీష్‌ ఆర్మీ ఛాలెంజర్‌ 2 మెయిన్‌ ట్యాంకులను నాలిగింటిని తూర్పు యూరప్‌కు తక్షణమే పంపుతున్నట్లు బ్రిటీష్‌ మీడియా తెలిపింది. ఆ తర్వాత మరో 8ట్యాంకులు పంపనున్నట్లు తెలిపింది.