తుఫాన్‌తో భారీ వ‌ర్షాల‌తో కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ

కొన్ని వారాలుగా తుఫాన్‌తో భారీ వ‌ర్షాల‌తో కాలిఫోర్నియాలో అధ్యక్షుడు జో బైడెన్ ఎమర్జెన్సీని ప్రకటించారు.  కాలిఫోర్నియాలో భారీ విపత్తు చోటు చేసుకున్న‌ద‌ని జో బైడెన్ ప్ర‌క‌టించారు. ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ఆర్థిక‌, హార్థిక సాయం అంద జేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.
 
తీవ్ర శీతాకాల తుఫాన్ వ‌ల్ల పోటెత్తిన వ‌ర‌ద‌ల వల్ల విరిగి ప‌డ్డ మ‌ట్టి చ‌రియ‌ల్లో, బుర‌ద‌లో చిక్కుకున్న బాధితుల‌ను ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించిన‌ట్లు వైట్ హౌస్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాలిఫోర్నియాలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించ‌డంతో బాధితుల‌కు తాత్కాలిక వ‌స‌తి క‌ల్పిస్తారు.
 
`కాలిఫోర్నియాను భారీ చ‌లిగాలులు చుట్టుముడ‌తాయి. భారీగా కురుస్తున్న వ‌ర్షాల‌తో మ‌ట్టి చ‌రియ‌లు విరిగి ప‌డే ముప్పు ఉంది. కాలిఫోర్నియా నుంచి కొలారెడో వ‌ర‌కు ప‌ర్వ‌త శ్రేణుల నుంచి భారీగా మంచు కురుస్తుండ‌టంతో ప్ర‌యాణం ప్ర‌మాద‌క‌రం` అని జాతీయ వాతావ‌ర‌ణ స‌ర్వీస్ హెచ్చ‌రించింది.వ‌ర‌ద‌ల వ‌ల్ల కాలిఫోర్నియాలో క‌నీసం 19 మంది మృతి చెందారు. వ‌ర‌ద నీరు లోత‌ట్టు ప్రాంతాల్లో ప్ర‌యాణిస్తున్న‌ది. కోస్తా పొడ‌వునా మూడంతస్తుల ఎత్తులో అల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. ఈ వ‌ర‌ద‌ల వ‌ల్ల 34 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం వాటిల్లుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.
కాలిఫోర్నియాలోని సాలినాస్ న‌ది వ‌ర‌ద‌తో ప‌రివాహ‌క ప్రాంతాల్లో పొంగి పొర్లుతున్న‌ది. జాతీయ ర‌హ‌దారుల‌పై వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తున్న‌ది. మరో తుఫాన్‌ పొంచి ఉన్న నేపథ్యంలో… 24 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికార ఆదేశాలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియాలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 14,411 మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం కూడా తుఫాన్‌ ముప్పు ఉందని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాలిఫోర్నియా తర్వాత ఈ తుఫాన్‌ లాస్‌ ఏంజెల్స్‌ వైపు వెళుతున్నట్లు అధికారులు వెల్లడించారు.