విదేశాల్లో భారీ లంచాలతో తప్పించుకొంటున్న మెహుల్‌ చోక్సీ

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీని తలదాచుకొంటున్న ఆంటిగ్వా నుండి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా అక్కడ  భారీ ఎత్తున లంచాలు ఇస్తూ తప్పించుకున్తున్నట్లు వెల్లడైంది. ప్రముఖ ఆర్థిక నేర పరిశోధకుడు కెన్నెత్‌ రిజోక్‌ పరిశోధన వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను ఆంటిగ్వాలో మెహుల్‌ చోక్సీ లంచం, కుట్రపేరుతో ఓ వార్తా పత్రికలో ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించారు.
 
మెహుల్‌ చోక్సీ భారీగా లంచాలు ముట్టజెప్పడంతో ..అతనిని భారత్‌కు అప్పగించేందుకు, అదుపులోకి తీసుకునేందుకు అక్కడి అధికారులు అడ్డుపడుతున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. సీనియర్‌ పోలీస్‌ అధికారి ఆడోనిస్‌ హెన్రీతో సహా ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా తన అప్పగింతను ఆలస్యం చేస్తున్నట్లు తేల్చారు.
 
ఆంటిగ్వాలో కోర్టు ప్రక్రియను చట్ట విరుద్ధంగా పొడగించేందుకు కుట్ర పన్నుతున్నాడని పేర్కొన్నారు. చోక్సీకి చెందిన జాలీ హార్బర్‌ రెస్టారెంట్‌ అల్‌పోర్టో ఇన్‌స్పెక్టర్‌ హెన్రీ కనీసం రోజుకి మూడుసార్లు భేటీ అవుతున్నట్లు పలువురు సాక్షులు పేర్కొన్నారని నివేదించారు. హెన్రీతో పాటు ఆంటిగ్వా మెజిస్ట్రేట్‌ కాన్లిఫ్‌ క్లార్క్‌ను ప్రభావితం చేసేందుకు యత్నించినట్లు తెలిపారు.
 
చోక్సీని భారత్‌కు అప్పగించాలని ఆంటిగ్వా కోర్టు ఆదేశించినప్పటికీ  మిలియన్‌ డాలర్ల నగదును దొంగిలించాడని ఆరోపిస్తూ అక్కడి అధికారులు, న్యాయమూర్తులు విచారణను ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే అంటిగ్వా నుండి క్యూబాకు పారిపోవడానికి కిడ్నాప్‌ డ్రామాలో విఫలమైన విధానాన్ని రిజోక్‌ ఆ కథనంలో వివరించారు.
 
క్యూబా, భారత్‌ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేనందున విచారణ నుండి తప్పించుకునేందుకు క్యూబా పారిపోవాలని చోక్సీ భావించాడని నివేదికలో పేర్కొన్నాడు. ఆయనను ఓడలో క్యూబాకు తీసుకువెళ్లేందుకు స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, అయితే వారికి నగదు మొత్తాన్ని నిరాకరించడంతో మే 2021న డొమినికా తీరంలో పడేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నాడు.
 
వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ భారత్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సహా ఇతర బ్యాంకుల నుండి రుణాలు పొంది, చెల్లించకుండా ఎగనామం పెట్టి, 2018లో భారత్‌ నుండి పారిపోయారు. అప్పటి నుండి అతనిని భారత్‌కు రప్పించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఇంటర్‌పోల్‌ చోక్సీకి రెడ్‌ నోటీసు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆంటిగ్వాలో భారీ పెట్టుబడులతో అక్కడి పౌరసత్వం సంపాదించాడు.