అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు పర్యాటక రైలు

శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య నుంచి సీతాదేవి జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్‌కు వచ్చే నెలలో భారత్ గౌరవ్ పర్యాటక రైలును నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. శ్రీరామ్-జానకి యాత్ర(అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు)ను ఫిబ్రవరి 17న ఢిల్లీ నుంచి ప్రారంభిస్తున్నట్లు రైల్వే తెలిపింది. ఈ రైలు ద్వార ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడి సాంస్కృతిక సంబంధాలు అభివృద్ధి చెందుతాయని రైల్వే పేర్కొంది. ఈ రైలు నందిగ్రామ్, సీతామఢి, ప్రయాగ్‌రాజ్ మీదుగా జనక్‌పూర్ వెళుతుంది.

జనక్‌పూర్, వారణాసిలో రెండు రాత్రుల బస ఉంటుందని, అయోధ్య, సీతామఢి, ప్రయాగ్‌రాజ్‌లో పగటి పూట యాత్ర ఉంటుందని తెలిపింది. ఢిల్లీ నుంచి బయల్దేరే భారత్ గౌరవ్ పర్యాటక రైలు మొదటగా అయోధ్యలో నిలుస్తుందని, పర్యాటకులు శ్రీరామ జన్మభూమి ఆలయాని, హనుమాన్ ఆలయాన్ని, అదనంగా నందిగ్రామ్‌లో భారత్ మందిరాన్ని సందర్శిస్తారని రైల్వే తెలిపింది.

అయోధ్య నుంచి బీహార్‌లోని సీతామఢి రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకుంటుందని, అక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని నేపాల్‌లోని జనక్‌పూర్‌కు బస్సులలో ప్రయాణిస్తారని రైల్వే వివరించింది. ఈ యాత్ర ప్రయాణ ఛార్జీలను ఒక్కో వ్యక్తికి ప్రారంభ ధర రూ. 39,775 నిర్ణయించారు.

 రైలులో నిర్దిష్టమైన తరగతి, ఎసి హోటళ్లలో రాత్రి బస, శాకాహార భోజనం, బస్సులలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, గైడ్ సర్వీసు వంటివి ఈ చార్జీలో పొందుపరచి ఉంటాయి. పర్యాటకుల సౌలభ్యం కోసం ఇఎంఐ పేమెంట్ ఆప్షన్‌ఉ సమకూర్చేందుకు పేటిఎం, రేజర్‌పేలతో ఐఆర్‌సిటిసి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రైల్వే తెలిపింది.