హిమాచల్ లో గెలుపొందగానే ప్రజలపై భారం మోపిన కాంగ్రెస్ 

హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భారం మోపింది. డీజిల్‌పై వ్యాట్ పెంచడంతో రాష్ట్రంలో డీజిల్ ధరలు పెరిగాయి. గతంలో డీజిల్‌పై 4 రూపాయల 40 పైసలు వ్యాట్ ఉండగా ప్రస్తుతం మరో 3 రూపాయలు పెంచింది. దీంతో వ్యాట్ 7 రూపాయల 40 పైసలకు చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర 86 రూపాయలకు చేరింది. 
 
హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీసుకున్న ఈ నిర్ణయంపై బిజెపి మండిపడింది. ఎన్నికల్లో గెలవగానే ప్రజలపై పన్నులు విధించడం ప్రారంభించారని బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ మంత్రి సురేశ్ భరద్వాజ్ ఎద్దేవా చేశారు. సామాన్యుల నడ్డి విరిచేలా డీజిల్‌ ధరలు పెంచారని ఆయన విమర్శలు గుప్పించారు.
అంతేకాదు ఆరుగురు ఎమ్మెల్యేలను చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించడాన్ని కూడా భరద్వాజ్ తప్పుబట్టారు. మరోవైపు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు.
 మరో ఏడుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో హిమాచల్ కేబినెట్ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కొత్తగా క్యాబినెట్‌లోకి తీసుకున్న మంత్రులతో గవర్నర్ రాజేంద్ర విశ్వానాథ్ ఆర్లేకర్ సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రమాణస్వీకారం చేయించారు.
డిసెంబర్ 11న సుఖ్వీందర్ సింగ్, ఆయన డిప్యూటీగా ముఖేష్ అగ్నిహోత్రి మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్‌ సభ్యుల సంఖ్య 12కు మించరాదు.