తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ రవి వాకౌట్!

తమిళనాడులో గవర్నర్ ఆర్ ఎన్ రవి, ఎం కె స్టాలిన్ ప్రభుత్వాల మధ్య విబేధాలు తీవ్ర రూపం దాల్చాయి. సోమవారం రాష్ట్ర శాసనసభలో ప్రసంగించడానికి గవర్నర్ వచ్చినప్పుడు నాటకీయ పరిణామాలు జరిగాయి. ప్రసంగం ప్రారంభించగానే సభ్యుల అల్లర్ల మధ్య, ముఖ్యమంత్రి స్టాలిన్ వైఖరితో ఆగ్రహం చెందిన గవర్నర్ సమావేశాల నుండి వాకౌట్ జరిపారు. 
 
 ప్రభుత్వం ముద్రించి ఇచ్చిన గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాలను ఆయన చదవకపోవడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగం మాత్రమే రికార్డుల్లో నమోదు కావాలని కోరుతూ స్టాలిన్ ఓ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీంతో గవర్నర్ సభ ముగిసే సమయంలో వినిపించే జాతీయ గీతాన్ని వినిపించక ముందే సభ నుంచి వెళ్ళిపోయారు.
 
తమిళనాడు శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్ని ఆర్ఎన్ రవి చదువుతూ, 65వ పేరాను చదవడం మానేశారు. 
 
ఇందులో ద్రవిడార్ కళగం వ్యవస్థాపకుడు పెరియార్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రులు కే కామరాజ్, సీఎన్ అన్నాదురై, ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్‌ల గురించి ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి పేర్కొన్న పేరాను కూడా గవర్నర్ చదవలేదు. 
 
తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందంటూ గవర్నర్‌ రవి వ్యాఖ్యానించారు. తమిళనాడు అంటే ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలంటూ సూచించారు.  దీనిపై డీఎంకే  సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు.
 
తమిళనాడు పేరును “తమిళగం”గా మార్చాలని గవర్నర్ చేసిన వ్యాఖ్యను నిరసిస్తూ బిజెపి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని గవర్నర్ ఈ రాష్ట్రం మీద రుద్దాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. కావాలనే గవర్నర్ తన ప్రసంగంలో తమిళనాడు అనే పదాన్ని ఉచ్ఛరించలేదంటూ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ప్రసంగం ప్రతుల్లో తమిళనాడు అని ఉన్నా ప్రస్తావించని వైఖరిపై సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రసంగంలో ఉన్న విషయాలను చదవకుండా తమిళనాడు ప్రజలను అవమానించారని విమర్శించారు. ప్రసంగంలో ఉన్న ద్రావిడ మోడల్, తమిళనాడు అన్న చోట గవర్నర్ ప్రత్యామ్నాయ పదాలను వాడారని పేర్కొన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ ప్రసంగంలోని పలు అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి  అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది.
 
రవి జాతీయ గీతం కోసం కూడా వేచి ఉండకుండా వెళ్లిపోయారని సభ్యులు మండిపడ్డారు.  ఇదే సమయంలో డీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్‌ చేసి అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. గవర్నర్ రవికి వ్యతిరేకంగా అసెంబ్లీలో “క్విట్ తమిళనాడు” అంటూ నినాదాలు చేశారు. 
 
అయితే బీజేపీ మాత్రం గవర్నర్ వ్యాఖ్యలను సమర్థించింది. తమిళనాడు గడ్డను తమిళ సాహిత్యంలో తమిళగం అని, తమిళనాడు అని పేర్కొన్నారని తెలిపింది. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ రవికి మధ్య విభేదాలు చాలా రోజుల నుంచి కొనసాగుతున్నాయి. 
 
అనేక సందర్భాల్లో ప్రభుత్వం తనకు పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఉంచడం, ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తుంటం, స్టాలిన్ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ఆయన చర్యలను తప్పుబట్టడం జరుగుతోంది. ఆన్‌లైన్ జూదం, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్‌లను నియమించడానికి గవర్నర్ అధికారాలను తొలగించడం సహా అసెంబ్లీ ఆమోదించిన 21 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి