రేంజర్ల రాజేష్ ను అరెస్టు చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడి

తెలంగాణలో హిందూ వ్యతిరేక చర్యలు మానుకోకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని విశ్వహిందూ పరిషత్ (వి హెచ్ పి) హెచ్చరించింది. రెండు వారాలు గడుస్తున్నా రేంజర్ల రాజేష్ ను అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధతకు నిదర్శనం అంటూ మండిపడింది.  పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ
రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని, నాస్తికవాదం ముసుగులో హిందుత్వంపై దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పథకం ప్రకారమే కెసిఆర్ ప్రభుత్వం హిందువులను అణిచివేసే కార్యక్రమం పెట్టుకుందని విమర్శించారు.  సీఎం ఆదేశానుసారం పోలీస్ యంత్రాంగం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, నిందితులకే మద్దతుగా నిలుస్తోందని పరిషత్ నేతలు ధ్వజమెత్తారు.  నిందితులకు మద్దతు పలుకుతూ, బాధితులను భయకంపితులను చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు చర్యలు మానుకోవాలని పేర్కొంటూ హిందువులను ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు.
 
నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మల్లమారి మల్లికార్జున్ తరగతి గదుల్లోనే మతమార్పిడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. విద్యార్థులను జాతి విద్రోహ శక్తులుగా తయారు చేసేందుకు ఉగ్రవాదం గురించి నూరిపోస్తున్నట్లు మండిపడ్డారు. నాస్తికత్వం పేరుతో దేవుడు లేడు అంటూనే క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాడని విమర్శించారు.
 
 జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న మల్లికార్జున్ పై కమ్యూనల్ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగం సంపాదించి క్రైస్తవ మతంలోకి మారిన మల్లికార్జున్ పై రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు.
 
కాగా, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లను చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామినీ కించపరిచే పోస్టింగులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేస్తే  నిందితులను శిక్షించకపోగా, కేసు వాపస్ తీసుకోవాలని బజరంగ్ దళ్ కార్యకర్తలను పిలిచి నలుగురు పోలీసు అధికారులు పోలిస్ స్టేషన్ లోనే చిత్రహింసలకు గురి చేశారని పరిషత్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇప్పటికీ ఆ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నలుగురు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాదారులతో సహా మానవ హక్కుల కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకు, హైకోర్టులో కూడా వారి దాస్టికం గురించి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
దేశానికే తెలంగాణ పోలీసులు తలమానికమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి రేంజర్ల రాజేష్ ను పట్టుకోకపోవడం సిగ్గుచేటని వారు ధ్వజమెత్తారు.  అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో నిఘా ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం హిందూ దేవతలను నీచంగా దూషించిన దుర్మార్గుడిని అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధత కు నిదర్శనం అని ఘాటుగా స్పందించారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే సరస్వతీ మాత భక్తుల ఆగ్రహం చవిచూడక తప్పదని వారు హెచ్చరించారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంగా హిందూ యువకులను ముస్లింలుగా మతం మారుస్తున్నారని పేర్కొంటూ ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో ఈ తంతు సాగుతుందని స్పష్టం చేశారు.
 
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఇస్లాం తీవ్రవాదులు తిష్టవేశారని, భగవద్గీత పేరుతో ఇస్లాం సాహిత్యాన్ని ఇల్లు ఇల్లు తిరిగి అమ్ముతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర నలుమూలల నాస్తికత్వం పేరుతో హిందుత్వం పై జరుగుతున్న దాడిపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.