నేడే తెలంగాణ బీజేపీ బూత్ కార్యకర్తల సమ్మేళనం

తెలంగాణాలో ఈ ఏడాది జరిగే ఎన్నికలలో అధికారంలోకి రావడానికి దూకుడుగా అడుగులు వేస్తున్న బీజేపీ ఆ దిశలో ఈ ఏడాది మొదటి కార్యక్రమం  బూత్ కార్యకర్తల సమ్మేళనం శనివారం జరిపేందుకు సర్వం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్టా వర్చువల్ విదానంలో బూత్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సరళ్ యాప్ ను ఆయన ప్రారంభింపనున్నారు. ఈ యాప్ ద్వారా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ కార్యక్రమాలకు మద్దతు తెలపాలనుకునే వారు 6359119119 మిస్డ్ కాల్ ఇవ్వాలని బీజేపీ కోరింది.
ఈ సమ్మేళనాలు  రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కూడా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. బీజేపీ “పాలక్” లు ఆయా నియోజకవర్గాల్లో నిర్విహించే కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వారిని ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రసంగించనున్నారు.
మిషన్ 90లో భాగంగా సంస్థాగత నిర్మాణంపై బీజేపీ దృష్టి సారించింది. ఫిబ్రవరి మెదటి వారంలోగా 34,600 బూత్ కమిటీలను నియమించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ సమావేశాలలో బిజెపి జాతీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖ నాయకులు పాల్గొంటున్నారు.
జూబ్లీహిల్స్ లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ముషీరాబాద్ లో బిజెపి ఎంపీ డా. కె లక్ష్మణ్, గద్వాల్ లో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ, కూకటపల్లిలో మాజీ ఎంపీ విజయశాంతి, ఎమ్యెల్యే ఈటెల రాజేంద్ర, హుజురాబాద్ లో, మహబూబ్ నగర్ లో  మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ధర్మపురిలో మాజీ ఎంపీ జి వెంకటస్వామి, సికిందరాబాద్ కంటోన్మెంట్ లో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి, నల్గొండలో  మాజీ ఎంపీ గరికపాటి మోహన్  రావు, మెదక్ లో ఎంపీ ధర్మపురి అరవింద్,  ములుగులో ఎంపీ సోయం బాబురావు, దుబ్బాకలో ఎం రఘునందన్ రావు, మునుగోడులో మాజీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చేవెళ్లలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, శేరిలింగంపల్లిలో మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ పాల్గొంటారు.