సిబిఐ ఢిల్లీ విభాగంపై ఎమ్యెల్యేల కొనుగోలు కేసు!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి నుండి ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఈ కేసును ఇటీవల సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్ళింది. 

ఈ క్రమంలో నేడు విచారణ జరిపిన కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేయగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  లేఖ రాశామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది.  పైగా, సిట్ తమకు ఎలాంటి పత్రాలు ఇవ్వలేదని, ఇస్తే దర్యాప్తు చేస్తామని సీబీఐ తెలపగా..హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆగాలని కోర్టు సీబీఐకి సూచించింది. 

ఇదే సమయంలో సీబీఐ డైరెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు.ఈ కేసుకు సంబంధించి బీజేపీ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపిస్తూ బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని స్పష్టం చేశారు. అలాగే ఒక్క ఎమ్మెల్యేను కానీ కొనుగోలు చేయలేదని తేల్చి చెప్పారు. 

2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని దామోదర్ రెడ్డి వాదించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేరాలని కేసీఆర్ బహిరంగంగా ప్రకటన చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దామోదర్ రెడ్డి వాదనలపై స్పందించిన న్యాయమూర్తి ఫాం హౌస్ కేసులో అసలు బీజేపీ, బీఆర్ఎస్ ప్రస్తావన ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ పిటిషన్ ను సింగిల్ జడ్జి బెంచ్ డిస్మిస్ చేసిందని, అలాంటప్పుడు బీజేపీ తరఫున మీరు ఎందుకు వాదనలు వినిపిస్తున్నారని అడిగారు. 

తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా సిట్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు ఉన్నందునే తాము కల్పించుకోవాల్సి వచ్చిందని దామోదర్ రెడ్డి చెప్పారు. సిట్ వాదనలకు సమాధానం చెప్పేందుకే రాజకీయాలను ప్రస్తావించానని స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.