ఫ్లైఓవర్లతో హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిపోదు

ఫ్లైఓవర్లుతో హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిపోదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నిజమైన హైదరాబాద్ అభివృద్ధి బస్తీలలో ఉందని చెప్పారు. హైదరాబాద్ అంటే కేవలం మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని చురకలు అంటించారు. 

శనివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మంత్రి కిషన్ రెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుడిమల్కాపూర్‌లో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించబోయే పార్క్, ఫూట్‌పాత్ డెవలప్‌మెంట్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 

అనంతరం గుడిమల్కాపూర్, బోజగుట్ట పరిధిలో సిసి రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో కనీస వసతులు లేక పేదలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

జిహెచ్‌ఎంసి, వాటర్ వర్క్ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వలన అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ల నుంచి ఆశ చూపుతుందే తప్ప ఆచరణలో మాత్రం పెట్టడం లేదని ధ్వజమెత్తారు.