కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ప్రయత్నంలో సంజయ్ అరెస్ట్

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‭లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‭, బీజేపీ కార్యకర్తలను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‭ను స్టేషన్‭కు తరలించేందుకు పోలీస్ వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకున్నారు. కొందరు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 

రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి సంజయ్ కలెక్టరేట్ ను ముట్టడించిన సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులు, బీజేపీ కార్యకర్తలు,  పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు సంజయ్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. మరోవైపు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు కొడుతున్నారని  బీజేపీ ఆరోపించింది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్, రైతు ఆత్మహత్యకు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా నిర్వహించింది. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  అంతకు ముందు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులకు మద్దతుగా సంజయ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు.

భారీ గేట్లు సైతం లెక్కచేయకుండా మహిళలు రైతులు, బీజేపీ నాయకులు తోసుకుంటూ వచ్చారు. కలెక్టర్ ను కలిసేంతవరకు వెళ్లెది లేదని అక్కడే కూర్చున్నారు. కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాల ప్రజలు, రైతులు చేస్తున్న ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సంజయ్ కోరారు.

రైతు ఆత్మహత్యతో ఉద్రిక్తత 

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా తనకు నష్టం జరుగుతుందన్న ఆందోళనతో సదాశివనగర్​మండలం అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా.. ఆయన కుటుంబాన్ని సంజయ్ శుక్రవారం పరామర్శించారు. మాస్టర్‌ ప్లాన్‌లో రైతుల పొలాలను పారిశ్రామికవాడల కింద గుర్తించడం వల్ల కొద్దిగా భూములున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మాస్టర్ ప్లాన్ తో భూమి పోతుందనే మనస్థాపంతోనే రాములు ఆత్మహత్య చేసుకున్నారని సంజయ్ ఆరోపించారు. రాములుని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు కలిసి చేసిన ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి వచ్చే దాకా కలెక్టర్ కార్యాలయం వద్దనే కూర్చుంటానని,  రైతులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని ప్రకటించారు.

రాములు ఆత్మహత్య తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొంటూ ఇండస్ట్రియల్ జోన్ కు బీజేపీ, కామారెడ్డి ప్రజలు వ్యతిరేకం కాదని సంజయ్ స్పష్టం చేశారు. అయితే, పేదల భూములనుప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధిచేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులకు రాష్ట్ర సర్కార్ అన్యాయం చేస్తోందని, అందుకే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిందని సంజయ్ మండిపడ్డారు. ‘‘ఇన్నేండ్లు దందాలు, స్కామ్​లు చేసి బాగా సంపాదించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు భూముల మీద పడ్డారు. పంటలు పండే భూముల్ని ఇండస్ర్టియల్​జోన్లుగా మారుస్తున్నారు. ఆ భూములను మళ్లీ  బీఆర్ఎస్ లీడర్లే కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు కామారెడ్డిలోనూ అలాగే చేసేందుకు కుట్ర పన్నారు” అని ఆయన ఆరోపించారు. 

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాస్టర్ ప్లాన్ చేసి రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రిగా మారిపోయారని విమర్శించారు.