నానాటికి కుంగిపోతున్న జోషిమఠ్‌… ఆందోళనలో స్థానికులు

బదరీనాథ్ పుణ్యక్షేత్రానికి ముఖ ద్వారంగా భావించే జోషిమఠ్‌ లో ఇండ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగి పోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని తక్షణం రంగంలోకి దిగాలని శుక్రవారం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాగం, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కూడిన నిపుణుల బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటి సర్వే చేపడుతోంది. 

గార్వాల్ కమిషనర్ సుశీల్ కుమార్, డిజాస్టర్ మేనేజిమెంట్ సెక్రటరీ రంజిత్ కుమార్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకు 561 ఇళ్లు బీటలు వారినట్టు ఛమోలీ జిల్లా యంత్రాంగం గుర్తించింది. డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం-2005 కింద హోటల్ వ్యూ, మలరి ఇన్‌లో పర్యాటకులను రాకపోకలను నియంత్రించారు. 

మంగళవారంనాడు తొమ్మిది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వీటిలో జోషిమఠ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన నాలుగు కుటుంబాలు, గురుద్వారా జోషిమఠ్‌కు చెందిన ఒక కుంటుంబం, టూరిస్ట్ హోటల్ నుంచి, మనోహర్ బాగ్, ఇతర ప్రాంతాలకు చెందిన కుటుంబాలు ఉన్నారు. ఇంతవరకు 38 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

జోషిమఠ్‌లో నెలకొన్ని పరిస్థితిపై అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చిస్తున్నట్టు పేర్కొంటూ అధికారుల నుంచి నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి భరోసా ఇచ్చారు.శనివారంనాడు స్వయంగా జోషిమఠ్ వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్టు చెప్పారు. బీజేపీకి చెందిన ఒక బృందాన్ని కూడా జోషిమఠ్‌కు పంపుతున్నట్టు తెలిపారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం గురువారం జోషిమఠ్, చుట్టుపక్కల నిర్మాణ పనులను నిలిపివేసింది, వీటిలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) ప్రాజెక్ట్‌లతో సహా ఉన్నాయి.  20,000 జనాభాతో 6,150 అడుగుల ఎత్తులో హిమాలయాలలో ఉన్న జోషిమత్ ఇప్పుడు మునిగిపోతోందని స్థానిక నివాసితులు ఆందోళన చెందుతున్నారు. 

కొండచరియల శిధిలాలపై నిర్మాణాలు 

కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాల మీద నిర్మితం కావడం వల్లే జోషీమఠ్‌ క్రమంగా కుంగిపోతున్నదని వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ డైరెక్టర్‌ కలాచంద్‌ సైన్‌ తెలిపారు. దాదాపు వందేళ్ల క్రితం ఈ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయని, ఈ కొండచరియల శిథిలాల మీద జోషీమఠ్‌ నిర్మాణం జరిగిందని, అందుకే పట్టణ పునాదులు బలహీనంగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

ఈ ప్రాంతం భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే సెస్మిక్‌ జోన్‌- 5లో ఉండటం, ఇక్కడి నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల కూడా ఇక్కడి శిలలు కాలక్రమేనా బలహీనంగా మారిపోయాయని వివరించారు. 1886లోనే హిమాలయన్‌ గెజెటర్‌లో జోషీమఠ్‌ కొండచరియల శిథిలాల మీద నిర్మితం అవుతున్నదని ఆట్కిన్స్‌ రాశారని ఆయన చెప్పారు.

1976లో కూడా మిశ్రా కమిటీ జోషీమఠ్‌కు పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించిందని పేర్కొన్నారు. జోషీమఠ్‌లో జనాభా పెరగడం వల్ల కట్టడాలు పెరగడం, పర్యాటక ప్రాంతంగా ఉండటం వల్ల హోటళ్ల వంటి భారీ నిర్మాణాలు చేపట్టడంతో ఇప్పుడు సమస్య జఠిలమైందని తెలిపారు. జోషీమఠ్‌లో చాలా ఇండ్లు కూలిపోవచ్చని, ప్రజలను ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.

వదులుగా ఉండే శిలలను కలిగి ఉన్న పెళుసుగా ఉండే పర్వత భూభాగాలపై అస్థిరమైన నిర్మాణం, నీటి ఉపరితలం కారడం, మట్టి కోత, స్థానిక ప్రవాహాలు మానవ నిర్మిత కారకాల కారణంగా వాటి మార్గాన్ని మార్చడంతో  వాటి సహజ ప్రవాహాన్ని అడ్డుకుంటుందని నిపుణులు ఈ పరిస్థితికి  కారణాలను విశ్లేషిస్తున్నారు. 

దెబ్బతిన్న జ్యోతిర్మఠం సముదాయం

ధార్మిక సంస్థల భవన సముదాయం కూడా ప్రభావితమైంది.  కొండచరియలు విరిగిపడటంతో జ్యోతిర్మఠం సముదాయం కూడా దెబ్బతిన్నది. కాంప్లెక్స్, లక్ష్మీ నారాయణ దేవాలయం భవనాల చుట్టూ పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. జ్యోతిర్మఠం ఇన్‌చార్జి బ్రహ్మచారి ముకుందానంద మాట్లాడుతూ ప్రవేశ ద్వారం, లక్ష్మీ నారాయణ దేవాలయం, ఆడిటోరియంలో పగుళ్లు ఉన్నాయని తెలిపారు.

జ్యోతిర్మఠం మీడియా ఇన్‌చార్జి డాక్టర్ బ్రిజేష్ సతీ మాట్లాడుతూ కొండచరియలు విరిగిపడటంపై జ్యోతిష్పీఠంలోని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా పనిచేయాలని శంకరాచార్య కోరారు. జ్యోతిర్మఠం ఇన్ చార్జి బ్రహ్మచారి ముకుందానంద్ మాట్లాడుతూ త్వరలో మఠం తరపున విపత్తు సేవా కేంద్రం గదిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

500కు పైగా ఇళ్లు నివాస యోగ్యం కావు 

ఉత్తరాఖండ్‌లో సంభవించే భారీ ప్రకృతి వైపరీత్యాలు,  ప్రమాదాలపై ఎస్ డి సి ఫౌండేషన్ తన మూడవ నివేదికను విడుదల చేసింది. ఉత్తరాఖండ్ డిజాస్టర్ అండ్ యాక్సిడెంట్ సినాప్సిస్  వేదిక ప్రకారం, జోషిమత్‌లోని 500కు పైగా ఇళ్లు నివాసయోగ్యం కావని స్పష్టం చేసింది. జోషిమఠ్‌లో కొనసాగుతున్న కొండచరియలు విరిగిపడటంపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఔలీ రోప్‌వే నిర్వహణ కూడా నిలిపివేయమని ప్రభుత్వం ఆదేశించింనల్టు రోప్‌వే మేనేజర్ దినేష్ భట్ తెలిపారు. జోషిమత్‌లోని రోప్‌వే టవర్ చుట్టూ ఉన్న భూమిలో కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

జేపీ కంపెనీ ఆవరణలో నిర్వహిస్తున్న పోస్టాఫీసును జోషిమఠ్‌లోని హెడ్ పోస్టాఫీసుకు మార్చారు. ఆవరణలో నిర్వహిస్తున్న పోస్టాఫీసు నీటి లీకేజీ వల్ల ప్రమాదంలో పడిందని పోస్టాఫీసు అధికారి ఎన్.లోహాని తెలిపారు.  సింఘ్‌ధార్ వార్డులోని హోటల్ మౌంట్ వ్యూ హోటల్ కూడా కొండచరియలు విరిగిపడటంతో దెబ్బతిన్నది. హోటల్‌ను పూర్తిగా ఖాళీ చేయించినట్లు హోటల్ యజమాని సుందర్ లాల్ సెమ్వాల్ తెలిపారు.

కాగా, మార్వాడి వార్డులో గ్రౌండ్ నుంచి వాటర్ లీకేజ్ వల్ల ఇళ్లలో భారీ పగుళ్లు వచ్చినట్టు జోషిమఠ్ మున్సిపల్ చైర్మన్ శైలేంద్ర పవార్ తెలిపారు. కొండచరియలు కారణంగా జోషిమఠంలో నిరాశ్రయులైన కుటుంబాలకు షెల్టర్లు ఏర్పాటు చేయాలని హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (హెచ్‌సీసీ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ)లను ఛమోలీ జిల్లా యంత్రాంగం కోరింది.