శంకరాచార్య పీఠంలోని శివలింగానికి పగుళ్లు !

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్న జోషిమట్‌లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మా భగవతి మందిరంను కొండచరియ దెబ్బతీశాక, ఇప్పుడు శంకరాచార్య మాధవ్ ఆశ్రం మందిరంలోని శివలింగంలో పగుళ్లు చోటుచేసుకున్నాయి. పైగా మందిరంలోని భవనంలో కూడా పగుళ్లు చోటుచేసుకున్నాయి.

లక్ష్మీ నారాయణ్ మందిరం చుట్టూ ఉన్న భవన సమాదాయంలో కూడా పగుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ భవన సముదాయంలో తోతకాచార్య గుహ, త్రిపుర సుందరి రాజరాజేశ్వరి మందిరం, జ్యోతిష్ పీఠంలోని శంకరాచార్య పీఠం ఉంది. జోషిమఠ్‌లో వినాశనం చూసి నిపుణుల బృందం కూడా ఆశ్చర్యపోతోంది.

నగరంలోని కట్టడాల్లో పగుళ్లు ఎందుకు ఏర్పడుతున్నాయో నిర్ధారించడంలో మొదటి రోజున నిపుణులు కూడా విఫలమయ్యారు. గోడలు, తలుపులు, నేల, డజన్ల కొద్దీ ఇళ్లలో పగుళ్లు చోటుచేసుకున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు నెట్‌లో విరివిగానే ఉన్నాయి.

కాగా శంకరాచార్య గద్ది స్థల్‌లో దర్శనమిస్తున్న దృశ్యాలు అందరినీ వేధిస్తున్నాయి. జోషిమఠ్‌లో కొండచరియలు విరగడంపై జోషిమఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆందోళన  వ్యక్తం చేశారు. ‘జ్యోతిర్‌మఠం కూడా ప్రకృతి విపత్తులో చిక్కుకుంది’ అని పేర్కొన్నారు.

కొండచరియలు విరిగిపడటం ద్వారా బాధితులైన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే సాయపడాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి పునరావాస కల్పన ఏర్పాట్లు కూడా చూడాలని కోరారు. ఏడాదిపాటుగా భూమి కుంగుతున్నప్పటికీ సకాలంలో దానిని ఎవరూ పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు.

 పుష్కర్ సింగ్ ధామీ పరామర్శ 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ శనివారం జోషిమఠ్‌కు చేరుకొని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు.  బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను కలిసి మాట్లాడారు. జోషిమఠ్ ప్రాంతంలో 600 ఇళ్లకు పగుళ్లు చోటుచేసుకోవడంతో ప్రజలు కంగారు పడుతున్నారు.

ముఖ్యమంత్రి చేరుకున్న మౌంట్ వ్యూ హోటల్ వద్ద సీనియర్ పోలీసు అధికారులను, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎస్‌డిఆర్‌ఎఫ్)ను మోహరించారు. కొండచరియలు విరిగిపడటంతో రెండు హోటళ్లు మౌంట్ వ్యూ, మల్లారీ స్వల్పంగా దెబ్బతిన్నాయి. వాటి వెనుక ఉన్న అనేక గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

జోషిమఠ్ ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశమని చెబుతూ ఇక్కడున్న ప్రతి ఒక్కరినీ రక్షించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. భూమి కుంగిపోతుండడం, ఇళ్లు బీటలు వారుతుండడం వెనక ఉన్న కారణం గురించి నిపుణులు తెలుసుకుంటున్నట్టు చెప్పారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పుష్కర్ సింగ్ ధామీ హామీ ఇచ్చారు.

ఆ ప్రాంతాన్ని పరిశీలించాక, అక్కడి ప్రజలను కలుసుకున్నాక ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఇండో-టిబెటియన్ బార్డర్ పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అంతేకాక ఆయన జోషిమఠ్‌ను ఏరియల్ సర్వే కూడా చేశారు. ‘ఈ ప్రాంత ప్రజలను సురక్షితంగా కాపాడాలని చూస్తున్నాం’ అని ఆయన విలేకరులకు తెలిపారు.