మహిళపై మూత్రం పోసిన విమాన ప్రయాణికుడి అరెస్ట్ 

న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా (విమానంలో ఓ వృద్ధురాలిపై మూత్రం పోసిన ప్రయాణికుడు శంకర్ మిశ్రాకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఘటన తర్వాత పరారైన శంకర్ మిశ్రా ఫోన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని ఢిల్లీ తీసుకెళ్లి పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. 
 
ఈ నెల 21 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు బెయిలు పిటిషన్‌ను ఈ నెల 11న విచారిస్తామని తెలిపింది. పోలీసులు మూడు రోజుల కస్టడీ కోరగా, సరైన కారణాలు లేకుండా ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు మిశ్రా ఇద్దరు ఎయిర్ ఇండియా విమాన పైలట్లు, కేబిన్ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నాడని, వారిని కూడా విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.
 
గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో మద్యం మత్తులో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న శంకర్ మిశ్రా మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. ఆ సమయంలో క్యాబిన్ లైట్లు ఆపి ఉన్నాయి. ఈ ఘటనపై కేబిన్ సిబ్బంది వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ బాధిత మహిళ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌కు రాశారు.
 
మరోవైపు, ఈ ఘటన వెలుగు చూసి దుమారం రేపడంతో అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో  వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న శంకర్ మిశ్రాను తొలగించింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ విమర్శలు రావడంతో శంకర్ మిశ్రాపై 30 రోజుల ట్రావెల్ బ్యాన్ విధించింది.
కాగా, ఈ ఘటన అనంతరం బాధితురాలికి పైలట్ సహకరించలేదని ప్రయాణికుడు ఒకరు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే సీటు కేటాయించేందుకు బాధిత మహిళ రెండు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ఘటన అనంతరం ఫస్టుక్లాస్ సీట్లు ఖాళీగా ఉన్నా విమాన పైలట్ ఆమెను అనుమతించలేదని లిఖిత పూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇద్దరు ఎయిర్‌హోస్టేస్‌లు బాధితురాలు దుస్తులు మార్చుకుని శుభ్రపడేందుకు సాయం చేశారని, ఆమె వస్తువులను శానిటైజ్ చేశారని డాక్టర్ భట్టాచార్జీ తెలిపారు. బిజినెస్ సీట్లు ఖాళీ లేకపోవడంతో బాధితురాలు చివరివరకు స్టీవార్డ్ సీటులో కూర్చుని ప్రయాణించారని భట్టాచార్జీ వివరించారు.