కర్ణాటకలో 150కు పైగా స్థానాలు గెలుస్తాం

2023లో జరిగే కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని పేర్కొంటూ, ఈసారి బీజెపి 150కు పైగా స్ధానాలను గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి పనుల రిపోర్టు కార్డు ఆధారంగానే ప్రజల్లోకి వెళతామని తెలిపారు. 

తుమకూరులో తుంకూరు, మధుగిరి జిల్లాల శక్తికేంద్ర ప్రముఖుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ కపటనాటకాలను ప్రజలు బాగా అర్ధంచేసుకుంటున్నారని, ఎన్నికల సమయంలో తగిన రీతిలో బుద్ధిచెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైను కించపరిచేలా మాట్లాడిన ప్రతిపక్షనేత సిద్ధరామయ్య తీరును నడ్డా తీవ్రంగా ఖండించారు.

పార్టీ ఏదైనా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని కాంగ్రెస్‌ నేతలకు ఆయన హితవు పలికారు. అభివృద్ధి ఆధారంగా ఎన్నికలను ఎదుర్కొవాలని ఆయన కాంగ్రె్‌సకు సవాల్‌ విసిరారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలను, రాష్ట్రంలో యడియూరప్ప, బొమ్మై ప్రభుత్వాల విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని పార్టీ శ్రేణులకు నడ్డా పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ అంతర్జాతీయ స్థాయి నేతగా ఎదగడం ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తి రెపరెపలాడుతుండటం మనందరి అదృష్టమని నడ్డా తెలిపారు. దేశసర్వతోముఖాభివృద్ధికి ప్రధాని అహర్నిశలు శ్రమిస్తున్నారని, మరోవంక బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్‌ కాలంనెట్టుకొస్తోందని ఆయన విమర్శించారు.

వారసత్వ రాజకీయాలకు బీజేపీ చెక్‌పెడుతూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేస్తోందని చెప్పారు. కులమత రాజకీయాలు, అవినీతి, ఉగ్రవాదం వంటి వాటిని ధీరోచితంగా అంతంచేసేందుకు తమ ప్రభుత్వం ప్రజామద్దతుతో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రధాని మోదీ సత్తా ఏమిటో ప్రపంచం అంతా గమనిస్తోందని పేర్కొన్నారు.

మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని నడ్డా భరోసా వ్యక్తం చేశారు. ప్రజలకోసం ప్రజల ఆకాంక్షల మేరకు దేశంలో పనిచేస్తున్న ఏకక పార్టీ తమదేనని చెబుతూ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు మరోసారి రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ గెలుపును కార్యకర్తలు కృషి చేయాలని నడ్డా పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళినికుమార్‌ కటిలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌సింగ్‌, కేంద్రమంత్రి నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు మాధుస్వామి, అరగజ్ఞానేంద్ర, బీసీ నాగే్‌షతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు పాల్గొన్నారు.