నీటి సంరక్షణలో  ప్రజల పాత్ర చాలా ముఖ్యం 

నీటి సంరక్షణలో ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే ఫలితాలనివ్వవని.. ఈ విషయంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వపు జవాబుదారితనం తరిగిపోదని, పైగా దాని అర్ధం కర్తవ్యాన్ని అంతటిని ప్రజల పైనే వేసేయాలని కూడా కాదని స్పష్టం చేశారు.

గురువారం రాష్ట్రాల నీటి వనరుల మంత్రులతో నిర్వహించిన తొలి జాతీయ సదస్సులో ప్రధాని వర్చువల్‌గా మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతో కలిగే అతి ప్రధానమైన ప్రయోజనం చైతన్యం అని పేర్కొంటూ ఈ  ప్రచార ఉద్యమంలో భాగంగా సాగుతున్న ప్రయత్నాల గురించి, అందుకోసం వెచ్చిస్తున్న డబ్బును గురించి ప్రజలలో ఒక అవగాహన ను ఏర్పరచడమే ప్రజల భాగస్వామ్యంతో సిద్దించే అతి పెద్ద ప్రయోజనం అని కూడా ప్రధాని చెప్పారు. 

 
‘‘ఒక ప్రచార ఉద్యమంతో ప్రజలు భాగస్వాములైతే, తమ కోసం  జరుగుతున్న పని ఎంత ముఖ్యమైనదో వారికి తెలిసి వస్తుంది. దీనితో ప్రజలలో ఏదైనా పథకం , లేదా ప్రచార ఉద్యమం పట్ల యాజమాన్య భావన కూడా ఏర్పడుతుంది’’ అని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.  నీరు.. రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయం, భాగస్వామ్యానికి సంబంధించిన అంశంగా ఉండాలని, అర్బనైజేషన్ వేగంగా జరుగుతున్న దృష్ట్యా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు.
మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం.. నీటి అంశం రాష్ట్రాల నియంత్రణలో ఉంటుందని, దేశ సమష్టి లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రాల కృషి చాలా దోహదపడుతుందని చెప్పారు. వాటర్ విజన్ @ 2047 అనేది వచ్చే 25 ఏండ్ల అమృత్ కాల్ జర్నీకి చాలా ముఖ్యమని ప్రధాని చెప్పారు. ఉపాధి హామీ కింద చేసే పనుల్లో.. వీలైనంత ఎక్కువగా నీటి కోసం చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణపై అవగాహన పెంచాలని కోరారు.
‘‘పరిశ్రమలు, వ్యవసాయం తదితర రంగాల్లో నీటి వాడకం ఎక్కువ. అందుకే వాళ్లకు అవగాహన పెంచాలి. పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయం వంటివి చేపట్టాలి” అని పిలుపునిచ్చారు.
 ‘‘కేవలం ప్రభుత్వం చేసే పనులతోనే విజయం సాధించలేం. నీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో వీలైనంత మేరకు ప్రజలు, సంఘాలు, ఇతర ఎన్జీవోలు కూడా  పాలుపంచుకోవాలి. ప్రజల భాగస్వామ్యం పెరిగినంత మాత్రానా.. ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గదు. ప్రజలపైనే భారం వేసినట్లు అంతకన్నా కాదు.. ఆయా కార్యక్రమాలకు ఖర్చు చేసే డబ్బు గురించి జనానికి అవగాహన కలుగుతుంది. గతంలో ప్రజలు స్వచ్ఛ భారత్ అభియాన్‌లో చేరినప్పుడు.. వారిలోనూ ఓ చైతన్యం మేల్కొన్నది” అని ఆయన గుర్తు చేసుకున్నారు.
మురికి నీటిని శుభ్రపరించేందుకు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మించామని, టాయిలెట్లు అందుబాటులోకి తెచ్చామని ప్రధాని చెప్పారు. అయితే మురికి అనేది ఉండకూడదని ప్రజలు అనుకుంటేనే విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో  కలిసి ఓ వ్యవస్థలా పని చేయాలని కోరారు. నీటిపై అవగాహన కల్పించేందుకు ‘వాటర్ అవేర్‌‌నెస్ ఫెస్టివల్స్’ లేదా ఇతర కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని చెప్పారు.
నీటి వ్యవస్థలను పునరుద్ధరించేందుకు ప్రతి జిల్లాలో 75 ‘అమృత్ సరోవర్ల’ చెప్పున నిర్మిస్తున్నామని, ఇప్పటిదాకా 25 వేల దాకా కట్టామని ప్రధాని  వెల్లడించారు. ‘‘వాడుకున్న నీటిని మళ్లీ వాడుకుంటే, తాజా నీటిని సంరక్షించుకుంటే  మొత్తం ఎకో సిస్టమ్‌కు ప్రయోజనం కలుగుతుంది. అందుకే వాటర్ ట్రీట్‌మెంట్, వాటర్ రీసైక్లింగ్‌ అనేది చాలా ముఖ్యం” అని ప్రధాని వివరించారు.