వ‌చ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిరం

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వచ్చే ఏడాది జనవరి 1 నాటికి పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. బీజేపీ ‘జన్‌ విశ్వాస్‌ యాత్ర’ను త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో ప్రారంభిస్తూ  కాంగ్రెస్‌, సీపీఎం కలిసి అడ్డుకున్నాయని, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని దశాబ్దాల పాటు కోర్టుల్లో నానేటట్లు చేశాయని విమర్శలు గుప్పించారు. 
 
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రధాని మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.  ”రాహుల్‌ బాబా వినండి.. నేను రామ మందిరం తెరవడానికి తేదీలు ప్రకటిస్తున్నాను” అంటూ జనవరి 1, 2024 నాటికి అయోధ్య రామమందిరం సిద్ధంగా ఉంటుందని ఆయన ప్రకటించారు.
 
హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలం వద్ద రామమందిర నిర్మాణం జరుగుతోంది. 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర వివాదానికి ముగింపు పలికింది. దీంతో ఆగస్టు 5, 2020న రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ చూస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రామ్‌ లల్లా గర్భగృహ దర్శనం జనవరి 2024 నుంచి ఉంటుందని ఇటీవల రామజన్మభూమి ట్రస్టు కూడా వెల్లడించింది. టెంపుల్‌ సైట్‌ వద్ద 550 మంది ఎల్‌ అండ్‌ టీ కార్మికులు పనిచేస్తున్నారు.
ఆలయ నిర్మాణం కోసం వాడే పింక్‌ సాండ్‌స్టోన్‌ కోసం రాజస్థాన్‌లో మరో వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు. పూర్తి టెంపుల్‌ కాంప్లెక్స్‌ను మాత్రం 2025లోగా పూర్తి చేయనున్నారు. విరాళాల రూపంలో రూ.3200 కోట్లు ఇప్పటికే ట్రస్టుకు అందాయి. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తోన్న ప్రదేశాన్ని రాముడి జన్మభూమిగా హిందువులు భావిస్తారు. ఇక్కడ రామాలయం ఉండేదని.. దాని స్థానంలో 16వ శతాబ్దంలో మసీదు నిర్మించారని భావిస్తారు. 500 ఏళ్ల చరిత్ర ఉన్న బాబ్రీ మసీదు 1992లో కూల్చివేతకు గురైంది.
అప్పటి నుంచి ఈ స్థలం ఎవరికి చెందుతుందనే విషయమై వివాదం నడిచింది. ఇక్కడ రామ మందిరం నిర్మిస్తామని మూడు దశాబ్దాలుగా బీజేపీ స్పష్టం చేస్తూ వస్తున్నది. 2019 నవంబర్ 9న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పును వెలువరించడంతో మార్గం సుగమమైంది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామాలయం నిర్మించడానికి వీలుగా ట్రస్ట్‌కు అప్పగించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు మరో చోట ఐదెకరాల స్థలం కేటాయించాలని తీర్పు వెలువరించింది.