విదేశీ యూనివర్సిటీల ఏర్పాటు స్వాగతిస్తున్న భారత్

మన దేశంలో విదేశీ యూనివర్శిటీల ఏర్పాటును స్వాగతిస్తున్నామని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ మామిడాల వెల్లడించారు. విదేశీ విద్యను మన దేశ విద్యార్థులకు చేరువ చేయడం దీని ఉద్దేశ్యమని తెలిపారు. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ యూనివర్శిటీలు మనదేశంలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మన దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై జగదేష్‌ కుమార్‌ గురువారం యుజిసి ముసాయిదా నిబంధనలను ప్రకటించారు. క్యాంపస్‌ల్లోని విదేశీ విద్యకు యుజిసి అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. దేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేసే విదేశీ విశ్వవిద్యాలయాలకు అడ్మిషన్ల ప్రక్రియకు స్వేచ్ఛ ఉంది.

అయితే, ఈ విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ అభ్యాస కార్యక్రమాన్ని అందించలేవు. క్యాంపస్‌ల ఏర్పాటుకు విదేశీ విశ్వవిద్యాలయాలకు పదేళ్ల కాలానికి యుజిసి అనుమతించింది. ఈ గడువును మరికొంతకాలం పొడిగించాలనుకుంటే విదేశీ మారక చట్టం ప్రకారం పొడిగింపు ఉంటుంది. ముఖ్యంగా విదేశీ వర్సిటీలు అందించే విద్య నాణ్యత, భారత క్యాంపస్‌లతో సమానంగా ఉండాలి. 

వీటిపై వాటాదారుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని నెలాఖరు తర్వాత తుది నిబంధనను తెలియజేస్తామని ఆయన వెల్లడించారు. దేశంలో క్యాంపస్‌లు ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చే విదేశీ యూనివర్శిటీలు అడ్మిషన్‌ ప్రక్రియ, ఫీజును నిర్ణయించుకోవచ్చని జగదీష్‌ కుమార్‌ తెలిపారు. 

టాప్‌ 500లో ఉన్న లేదా ఆ దేశంలో మంచి గుర్తింపు పొందిన విదేశీ వర్సిటీలు దరఖాస్తు చేసుకుంటే తొలుత పదేళ్లకు అనుమతిస్తామని పేర్కొన్నారు. దేశంలో రెండేళ్లలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మాతృ క్యాంపస్‌తో సమానంగా ఇక్కడ విద్యాప్రమాణాలుండేలా చూసుకోవాలని, ఇక్కడి నిధులు అక్కడికి పంపించుకోవచ్చని తెలిపారు. 

అడ్మిషన్‌ ప్రక్రియ, ఫీజు నిర్ణయించుకోవచ్చని, అయితే అవి పారదర్శకంగా, సహేతుకంగా ఉండాలని స్పష్టం చేశారు. అధ్యాపకులు, సిబ్బందిగా ఏ దేశం వారినైనా నియమించుకోవచ్చని, ఆఫ్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాలని వివరించారు.

విదేశాలలో చదువుకోవడానికి ఏటా మన నుంచి సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు వెళుతున్నారని, దేశంలోనే విదేశీ వర్శిటీలు ఏర్పడితే వారికి నివాస వ్యయం, ట్యూషన్ ఫీజు తగ్గి తక్కువ ఖర్చుతో వారు కోరుకున్న విద్యను  అభ్యసరించగలుగుతారని చైర్మన్ తెలిపారు. యుజిసి అనుమతి లేకుండా ఏ విదేశీ యూనివర్శిటీ క్యాంపస్‌ల ను ఏర్పాటు చేయదని స్పష్టం చేశారు.

దేశంలో ఏర్పాటయ్యే విదేశీ వర్శిటీలు వాటి ప్రధాన క్యాంపస్‌లలో రెండు సార్లు ప్రవేశాలు చేపట్టే విధానం ఉంటే, మనదేశంలో కూడా ఆ విధానం అమలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు పార్ట్‌టైం ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.