హెరిటేజ్ రూట్ల‌లో ప‌రుగులు పెట్ట‌నున్న‌ హైడ్రోజ‌న్ రైళ్లు

హెరిటేజ్ రూట్ల‌లో హైడ్రోజ‌న్ రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా దేశ లోకోమోటివ్ మొబిలిటీ రూపురేఖ‌లు మార్చ‌నున్న‌ట్టు రైల్వేలు ప్ర‌క‌టించాయి. ఈ రైళ్ల‌లో విస్టాడోమ్ కోచ్‌లతో పాటు ప్ర‌తి కోచ్‌లోనూ ప్ర‌ప‌ల్ష‌న్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. 2023 ద్వితీయార్ధంలో ఈ ప్ర‌క్రియ ప్రారంభమ‌వుతుంద‌ని భారతీయ రైల్వేలు వెల్ల‌డించాయి.
 
చైనా త‌న తొలి హైడ్రోజ‌న్ ట్రైన్‌ను లాంఛ్ చేసిన కొద్దిరోజుల‌కే రైల్వేలు ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. రాబోయే రోజుల్లో గ్రీన్ హైడ్రోజ‌న్ వాడ‌కాన్ని ముమ్మ‌రంగా చేప‌ట్టే క్ర‌మంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. గ్రీన్ హైడ్రోజ‌న్ రంగంలో గ్లోబ‌ల్ హ‌బ్‌గా భార‌త్ ఎదిగేలా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది.
 
హెరిటేజ్ కోసం హైడ్రోజ‌న్ ప్ర‌ణాళిక‌తో రైళ్ల టెక్నాల‌జీ, రూపురేఖ‌లు, ఆప‌రేటింగ్ సిస్టం మార‌డ‌మే కాకుండా ప్ర‌జా రవాణా వ్య‌వ‌స్ధ‌లో గ్రీన్ ఎన‌ర్జీని పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తుంద‌ని భావిస్తున్నారు.ఇక ఈ హైడ్రోజ‌న్ ట్రైన్‌ల‌ను నారో గేజ్‌తో పాటు, మీట‌ర్ గేజ్‌పైనా ప్ర‌వేశ‌పెట్టే వెసులుబాటు ఉంది.
 
ఎనిమిది హెరిటేజ్ రూట్ల‌లో హైడ్రోజ‌న్ ట్రైన్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 19.97 కి.మీ పొడ‌వైన మ‌థెర‌న్ హిల్ రైల్వే, 88.6 కి.మీ పొడ‌వైన డార్జ‌లింగ్ హిమాల‌య‌న్ రైల్వే, క‌ల్క‌-సిమ్లా రైల్వే, కంగ్రా వ్యాలీ రైల్వే, బిల్మోరా వ‌ఘై రూట్‌, మో ప‌ట‌ల్పానీ, నీల‌గిరి మౌంటెన్ రూట్‌, మ‌ర్వార్ దేవ్‌ఘ‌ఢ్ మ‌ద్రియ రూట్‌ల‌లో హెరిటేజ్ రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు రైల్వేలు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశాయి.