సరస్వతి దేవిపై అనుచిత వ్యాఖ్యలు… బాసరలో బంద్

అయ్యప్పస్వామి పుట్టుకను కించపరుస్తూ అసభ్యకర పదజాలంతో దూషించిన ఓయూ స్టూడెంట్, భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు భైరి నరేష్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపింది. అది మరువకముందే ఇప్పుడు బాసర అమ్మవారిపై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలపై నిరసలు వ్యక్తమవుతోన్నాయి. సరస్వతి అమ్మవారిపై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం నిర్మల్ జిల్లా బాసరలో బంద్ పాటించారు.
 
బాసర ప్రధాన ఆలయం దగ్గర అర్చకులు నిరసన చేపట్టారు. స్థానికులు కూడా బంద్ పాటిస్తుండటంతో.. బాసర రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. వ్యాపార సంస్థలు, ప్రజలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపారులు స్వచ్చంధంగా తమ దుకాణాలను మూసివేసి రోడ్లపై బైఠాయించి ఆందోనలు చేపట్టారు. పట్టణంలో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి.
 
చదువుల తల్లిపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అర్చక, హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీంతో బాసర పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇటీవల భైరి నరేష్‌కు సపోర్టుగా రేంజర్ల రాజేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో అతడి ఇంటి ముందు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.
 
భైరి నరేష్‌ను సమర్థిస్తూ పోస్టులు పెట్టినందుకు రేంజర్ల రాజేష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భైరి నరేష్‌కు సపోర్ట్‌గా పోస్ట్ పెట్టినందుకు రేంజర్ల రాజేష్ క్షమాపణలు చెప్పారు. రేంజర్ల రాజేష్ గతంలో అయ్యప్పస్వామిని కించపరుస్తూ పాటలు పాడి యూట్యూబ్‌లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
 

పి డి యాక్ట్ నమోదు చేయాలి

 
 కాగా, చదువుల తల్లి సరస్వతీమాతను అసభ్యకర పదజాలంతో దూషించిన హిందూ ద్రోహి రేంజర్ల రమేష్ పై పి డి యాక్ట్ నమోదు చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.  చదువుల తల్లిని ఐటమ్ గర్ల్ అని.. సరస్వతి ఎక్కడ చదువుకుందని, అసలు ఆమె చదువుకున్న యూనివర్సిటీ ఏది అని.. చదువుకుంటే ఆమె మెడలో బంగారు పతకాలు ఉండాలి కానీ ఆభరణాలు ఎందుకు ఉన్నాయని.. మరి ముఖ్యంగా ఆమె డాన్స్ టీచర్ అని.. అందుకే సరస్వతి చేతిలో వీణ ఉందని అంటూ  ఆరోపించిన రేంజర్ల రమేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
 
 పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్, ప్రచార ప్రముఖ్ బాలస్వామి ఓ ప్రకటనలో హిందూ దేవుళ్లను విమర్శించడం, ప్రచారం పొందడం ఓ ఎజెండాగా మార్చుకున్న కొంతమంది హిందూ ద్రోహులు అవాకులు చవాకులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్ననే ఒకడు అయ్యప్ప పుట్టుక గురించి, నేడు సరస్వతీ మాత ఉనికి గురించి ఇంకొకడు మాట్లాడటం హిందువులపై జరుగుతున్న దాడికి నిదర్శనం అని పేర్కొన్నారు.
 
 వీడియోలు, ఆడియోలు.. వాళ్ల సొంత చానల్స్ లలో రకరకాల హిందూ దేవి దేవతల వ్యతిరేక మాటలు, పాటలు, ఉపన్యాసాలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. దీంతో హిందూ ద్రోహులంతా మరింత రెచ్చిపోపోతున్నారన్నారని ధ్వజమెత్తారు. నాస్తిక వాదం పేరుతో హిందూ దేవుళ్ళని టార్గెట్ చేయడం.. దుర్భాషలాడటం క్షమించరాని నేరమని వారు స్పష్టం చేశారు.
 
 కొంతమంది పోలీసు అధికారులు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రముఖమైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వ్యక్తులకు మద్దతుగా నిలవడం సమాజం కషమించదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వారు హితవు పలికారు.