షాంఘై న‌గ‌రంలో 70 శాతం మందికి కరోనా

చైనాలోని షాంఘై న‌గ‌రంలో ప్ర‌స్తుతం హాస్పిట‌ళ్లు కరోనా రోగుల‌తో నిండిపోతున్నాయి. ఆ న‌గ‌రంలో దాదాపు 70 శాతం మందికి కోవిడ్ సోకి ఉంటుంద‌ని సీనియ‌ర్ డాక్ట‌ర్ ఒక‌రు తెలిపారు. డిసెంబ‌ర్‌లో కరోనా ఆంక్ష‌ల‌ను స‌డ‌లించిన త‌ర్వాత అక్క‌డ భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. దీంతో హాస్పిట‌ళ్లు, శ్మ‌శాన‌వాటిక‌లు కిక్కిరిసిపోతున్నాయి.

రుయిజిన్ హాస్పిట‌ల్ వైస్ ప్రెసిడెంట్‌, షాంఘై కోవిడ్ అడ్వైజ‌రీ ప్యానెల్ నిపుణుడు చెన్ ఎర్జ‌న్ దీనిపై మాట్లాడారు. షాంఘైలో ఉన్న 2.5 కోట్ల మంది ప్ర‌జ‌ల్లో.. చాలా మందికి వైర‌స్ సోకి ఉంటుంద‌న్నారు. ఆ న‌గ‌రంలో ప్ర‌స్తుతం వైర‌స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంద‌ని, జ‌నాభాలో 70 శాతం మందికి ఆ వైర‌స్ సోకి ఉంటుంద‌ని, గ‌త ఏప్రిల్‌, మే నెల‌ల‌తో పోలిస్తే అది 20 నుంచి 30 శాతం అధికంగా ఉంటుంద‌న్నారు.

గ‌త ఏప్రిల్‌లో షాంఘైలో క‌ఠిన రీతిలో లాక్‌డౌన్ అమ‌లు చేశారు. ఆ స‌మ‌యంలో సుమారు ఆరు ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోకింది. భారీ స్థాయిలో క్వారెంటైన్ సెంట‌ర్ల‌లో వాళ్ల‌ను లాక్ చేసిన విష‌యం తెలిసిందే. కానీ ప్ర‌స్తుతం మ‌ళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. న‌గ‌రంలో ఆ వేరియంట్ జోరుగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆ ఇన్‌ఫెక్ష‌న్లు అధికంగా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

బీజింగ్‌, తియాంజిన్‌, చాంగ్‌కింగ్‌, గాంగ్‌జూ లాంటి న‌గ‌రాల్లో ఇప్ప‌టికే కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయి. రుయిజిన్ హాస్పిట‌ల్‌లో ప్ర‌తి రోజు 1600 ఎమ‌ర్జెన్సీ అడ్మిష‌న్లు జ‌రుగుతున్న‌ట్లు చెన్ ఎర్జ‌న్ తెలిపారు. ప్ర‌తి రోజు హాస్పిట‌ల్‌కు వంద అంబులెన్సులు వ‌స్తున్న‌ట్లు చెప్పారు. 65 ఏళ్లు దాటిన వారంతా ఎమ‌ర్జెన్సీ విభాగంలో జాయిన్ అవుతున్న‌ట్లు తెలిపారు.

భారత్ లో పెరుగుతున్న కేసులు
 
 ఇలా ఉండగా,  భారత్ లో కూడా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,582 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 222 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.8 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.09 శాతంగా ఉంది.
 
కాగా, గడిచిన 24 గంటల్లో 1,51,186 కోవిడ్‌ నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఎక్స్‌బిబి ఇటీవల సింగపూర్‌లో వేగంగా వ్యాప్తి చెందింది. ఈ వేరియంట్‌ త్వరగా వ్యాప్తి చెందుతుందని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లుహెచ్‌ఓ) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ శుక్రవారం హెచ్చరించారు.
 
ఈ నేపథ్యంలో గతవారం కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్‌ మాండవియా ఆరోగ్య అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. ఈ సమావేశలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించేలా, కరోనా జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.