రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు 

రోడ్‌ షో సభలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. మున్సిపల్‌, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్‌ నిబంధనలను అమలు చేయనున్నారు.

ర్యాలీలు, సభల్లో తొక్కిసలాటలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నందున పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎవ్వరూ ర్యాలీలు చేపట్టరాదని పేర్కొంది. సభలు, ర్యాలీలు నిర్వహించే పార్టీలు రోడ్డుకు దూరంగా ప్రైవేటు స్థలాలు ఎంపిక చేసుకోవాలని సూచించింది. తాజా జీవో ప్రకారం.. ర్యాలీలు, సభలకు నిర్వాహకులు ముందుగానే లిఖితపూర్వకంగా పోలీసుల అనుమతి కోరాలి.

ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని హోంశాఖ ఆదేశాల్లో  స్పష్టం చేసింది.  ప్రజలకు ఇబ్బందిలేని విధంగా రోడ్డుకు దూరంగా సభలు, రోడ్డు షోలు నిర్వహించుకోవాలని హోం శాఖ సూచించింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లోనే షరతులతో కూడిన అనుమతివ్వనున్నట్లు చెప్పింది.

సభ ఎందుకు నిర్వహిస్తున్నారు.. దాని వెనకున్న ఉద్దేశం ఏంటి.. ఏ సమయం నుంచి ఎంత వరకూ నిర్వహిస్తారు.. కచ్చితమైన రూట్‌ మ్యాప్‌, హాజరయ్యే వారి సంఖ్య, కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు తీసుకున్న జాగ్రత్తలు వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని తెలిపింది. ఇబ్బంది లేదని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లకు అనిపిస్తే అనుమతి వస్తుందని.. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే అనుమతి లభిస్తుందని పేర్కొంది.

 అయితే ఆ అరుదైన సందర్భాలంటే ఏమిటో జీవోలో వివరించలేదు. కాగా.. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్రకు పోలీసుల అనుమతి తీసుకోలేదని.. ఇప్పుడు అధికారం రాగానే జగన్‌ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. అనుమతిస్తాం.. లిఖితపూర్వకంగా వైసీపీ తరఫున దరఖాస్తు చేయాలని అప్పటి పోలీసు అధికారులు కోరినా.. అనుమతి తీసుకునే ప్రసక్తే లేదని జగన్‌ తెగేసి చెప్పారని గుర్తుచేస్తున్నారు.

ఈ ఉత్తరువులు జారీకాగానే, చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 4, 5, 6 తేదీలలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన పర్యటనకు ఆంక్షలు ఎదురవుతున్నాయి. గత ఏడాది నుంచి ప్రతి మూడు నెలల కొకసారి కుప్పం నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటించే ఆనవాయితీలో భాగంగా చంద్రబాబు ఈ నెల 4వ తేదీ ఉదయం బెంగళూరు నుంచి కుప్పంకు రానున్నారు.

ఈ కారణంగా బహిరంగ కార్యక్రమాల నిర్వహణకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.. ఈ మేరకు చంద్రబాబు పీఏ మనోహర్ కు మంగళవారం పోలీసు అధికారులు లేఖ రాశారు. ఆ లేఖలో ఇరుకు సందుల్లో, జాతీయ, రాష్ట్రీయ రహదారులలో ర్యాలీలు. సభలు, ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. కావాలంటే సభల నిర్వహణకు విశాలమైన మైదాన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అనుమతి కోరితే పరిశీలిస్తామని ఆ లేఖలో పలమనేరు డీ ఎస్ పీ స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు నోరెత్తకుండా చేయాలనే కుట్రతోనే రోడ్‌షోలపై నిషేధం విధిస్తూ జీవో నంబర్‌ 1ని తీసుకొచ్చారని ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రాను రాను ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉండడం, ప్రతిపక్షాలకు స్పందన పెరుగుతూ ఉండడంతో ఈ చీకటి జిఓ తీసుకువచ్చిన్నట్లు మండిపడుతున్నారు.